అటు యాంకర్‌గా, ఇటు నటిగా అనసూయ ఎలా దూసుకెళ్తోందో అందరికీ తెలుసు! జబర్దస్త్ షో పుణ్యమా అని బుల్లితెరపై మెరిసింది. అందాలతో మైమరిపించడంతో కుర్రకారులో ఎనలేని ఫాలోయింగ్ వచ్చింది. దాంతో ఐటమ్ సాంగ్ ఆఫర్స్ వచ్చిన ఈ భామ.. ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా తనదైన ముద్ర వేసింది. అంతే, ఆ పాత్ర చేసినప్పటి నుంచి అనసూయకు తిరుగులేకుండా పోయింది. వరుసగా క్రేజీ ఆఫర్లు రావడం మొదలైంది. అల్లాటప్పా పాత్రల్లో కాకుండా, ప్రభావితం చేయగల క్యారెక్టర్లు చేస్తూ వస్తోంది. అలాంటి అనసూయ ఇప్పుడు వేశ్యగా నటించేందుకు సన్నద్ధమవుతోందని సమాచారం.
ఇప్పుడంతా వెబ్ సిరీస్‌లా హవా నడుస్తున్న తరుణంలో.. జనాల్లో మంచి గుర్తింపు నటులతో ఫిల్మ్ మేకర్స్ క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నారు. లేటెస్ట్‌గా అనసూయతో ఫీమేల్-సెంట్రిక్ వెబ్ సిరీస్ చేసేందుకు శ్రీకారం చుట్టారు. గురజాడ అప్పారావు నాటకం ‘కన్యాశుల్కం’ ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. ఇందులోనే ఈ యాంకరమ్మ వేశ్య పాత్రలో కనిపించనుంది. ఆనాటి నాటకానికి మోడ్రన్ హంగులతో మెరుగులదిద్ది.. ఈ సిరీస్‌ను రూపొందించనున్నారు. ఈ సిరీస్ మొత్తం అనసూయ చుట్టే తిరుగుతుంది. అంటే, అనసూయదే ప్రధాన పాత్ర అన్నమాట! క్రైమ్‌తో కూడిన అంశాలతో సమాజానికి మెసేజ్ ఇచ్చే కాన్సెప్ట్ కావడంతో.. అనసూయ ఇందులో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇలా ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లతో పాటు ఇతర షోలతోనూ బిజీగా ఉన్న నేపథ్యంలో.. అనసూయ ‘జబర్దస్త్’కి గుడ్ బై చెప్పినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ యాంకరమ్మ రంగమార్తాండ, ఫ్లాష్ బ్యాక్, గాడ్ ఫాదర్, మైఖేల్, వాంటెడ్ పండుగాడ్, అరి, దర్జా సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది. మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన భీష్మ పర్వం సినిమాతోనూ అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యింది.