Ananya Pandey Speech In Liger Fandom Tour: ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భామలు దాదాపు ఇంగ్లీష్‌లోనే తమ స్పీచ్‌లు ఇస్తుంటారు. మహా అయితే ‘నమ‘ష్కా’రం’ అని స్పీచ్‌ని మొదలుపెడతారే తప్ప, మిగతాదంతా ఆంగ్లంలోనే మాట్లాడి వెళ్లిపోతారు. ఎవరో ఒకరిద్దరు మినహాయిస్తే.. మిగతా వాళ్లందరిది ఇంగ్లీష్ స్పీచే! అయితే.. అనన్యా పాండే మాత్రం తెలుగు రాకపోయినా, తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించి అందరి మనసులు దోచుకుంది. అక్షర దోషాలు చాలానే ఉన్నప్పటికీ, మాట్లాడేందుకు ఆమె చేసిన సాహసాన్ని మెచ్చుకోవాల్సిందే!
‘నమస్తే వరంగల్’ అంటూ తన ప్రసంగం మొదలుపెట్టిన అనన్యా.. తన పేరు అనన్యా పాండే అంటూ తనని తాను తెలుగు ప్రేక్షకులతో పరిచయం చేసుకుంది. తనకు తెలుగు సినిమా ఆడియన్స్ అంటే చాలా ఇష్టమని, తనకు ఎప్పట్నుంచో తెలుగు చిత్ర పరిశ్రమలో భాగం కావాలన్న కోరిక ఉండేదని, ఇప్పుడు లైగర్‌తో అది తీరిందని పేర్కొంది. తన తొలి తెలుగు సినిమానే పూరీ జగన్నాథ్, చార్మీ, మైక్ టైసన్‌తో పాటు విజయ్ దేవరకొండతో కలిసి పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ఆగస్టు 25వ తేదీన వస్తోన్న ఈ సినిమాతో బాక్సాఫీస్ పగిలిపోద్ది అని చెప్పింది. ఇక్కడ ‘పగిలిపోద్ది’ అని చెప్పడానికి అనన్యా చాలానే కష్టపడింది. సినిమా ఫుల్ ర్యాంప్ అని, తామొక పక్కా మాస్ కమర్షియల్ సినిమాను దింపుతున్నామని, ఈ సినిమా చూశాక కచ్ఛితంగా మజా వస్తుందని ఫుల్ జోష్‌తో చెప్పింది.
అంతేకాదండోయ్.. ఈ ప్రసంగంలో భాగంగా విజయ్ దేవరకొండను పదే పదే ‘నా బుజ్జి కన్నా’ అని అనన్యా చెప్పుకొచ్చింది. ఆమె తెలుగు స్పీచ్‌తో అవాక్కైన యాంకర్ సుమ.. నీకు ఏమేం నేర్పించారు? అసలు నీకు తెలుగు నేర్పించిన గురువు ఎవరు? అంటూ సరదాగా ప్రశ్నించగా.. ‘నా బుజ్జి కన్నా’ అంటూ అనన్యా సమాధానం ఇచ్చింది. అప్పుడు సుమ వెంటనే అందుకొని.. ‘నీకు మంచి గురువు గారు దొరికారు, తర్వాత్తర్వాత మంచి మంచి పదాలు దొరుకుతాయి’ అంటూ ఛలోక్తులు పేల్చారు. దీంతో ఆ వేదిక మొత్తం నవ్వులు పూశాయి. ఏదేమైనా.. అనన్యా తెలుగు మాట్లాడిన స్పీచ్ మాత్రం అద్భుతమనే చెప్పాలి. లేడీ కొండలాగా కాసేపు స్టేజ్ మీద ఫుల్ జోష్‌తో ఊగిపోయింది.