‘డాన్’ అనగానే ఆ తరం వారికి బిగ్ బి అమితాబ్ బచ్చన్, నవతరం ప్రేక్షకులకు షారుఖ్ ఖాన్ గుర్తుకు వస్తారు. ఈ రెండు చిత్రాలు సలీమ్-జావేద్ కథతో రూపొందినవే. అమితాబ్ బచ్చన్ ‘డాన్’ చంద్ర బరోట్ దర్శకత్వంలో రూపొందగా, 1978లో విడుదలై విజయఢంకా మోగించింది. ఆ సినిమా హైదరాబాద్ తారకరామ థియేటర్ లో 75 వారాలు ప్రదర్శితమైంది. అదే కథ 1979లో యన్టీఆర్ హీరోగా ‘యుగంధర్’ పేరుతో తెలుగులోనూ, ఆ తరువాత ‘బిల్లా’ పేరుతో రజనీకాంత్ తోనూ, ఆ పై మోహన్ లాల్ హీరోగా ‘శోభరాజ్’ టైటిల్ తోనూ, అటు పై పాకిస్థాన్ లోనూ ‘కోబ్రా’ పేరుతో రీమేక్ అయి అన్ని భాషల్లోనూ అలరించింది. అంత ఘన చరిత ఉన్న ‘డాన్’ను 2006లో సలీమ్- జావేద్ ద్వయంలో జావేద్ తనయుడు ఫరాన్ అఖ్తర్, షారుఖ్ ఖాన్ తో తెరకెక్కించాడు. ఈ సినిమా విడుదలయ్యాక, అమితాబ్ స్థాయిలో షారుఖ్ నటించలేదని టాక్ వినిపించింది. దాంతో షారుఖ్ తో 2011లో ‘డాన్-2’ రూపొందించి, విజయం సాధించాడు ఫరాన్. తొలి ‘డాన్’ కథతోనే తమిళంలో అజిత్ హీరోగా ‘బిల్లా’, తెలుగులో ప్రభాస్ హీరోగా ‘బిల్లా’ తెరకెక్కాయి. ఇలా ‘డాన్’ కథ భలేగా సందడి చేసింది.

అదలా ఉంచితే, ఇటీవల తన ‘డాన్’ 44 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ నాటి ముంబై థియేటర్ లో ఆ సినిమా కోసం క్యూలో ఉన్న జనం ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పొందు పరిచారు బిగ్ బి. ఆ పై ‘డాన్’ పోస్టర్ పై అమితాబ్ తో ఆటోగ్రాఫ్ తీసుకుంటున్న షారుఖ్ ఖాన్ ఫోటో సైతం ఇన్ స్టాలో దర్శనమిచ్చింది. ఆ ఫోటోకు “అరె… ఒకే బాటలో పయనిస్తున్న ఇద్దరు…” అనే క్యాప్సన్ పెట్టారు బిగ్ బి. దాంతో వీరిద్దరూ కలసి ‘డాన్ -3’లో నటిస్తున్నారు అనే మాట విశేషంగా వినిపిస్తోంది. పైగా బిగ్ బితో షారుఖ్ నటించిన “మొహబ్బతే, కభీ ఖుషి కభీ ఘమ్, కభి అల్విద నా కెహనా” వంటి చిత్రాలు జనాన్ని విశేషంగా అలరించాయి. ఈ నేపథ్యంలోనే ఈ డాన్లు ఇద్దరూ కలసి ‘డాన్-3’లో నటిస్తే చూడాలని అభిమానులు సైతం ఆశిస్తున్నారు. మరి ‘డాన్-3’ వస్తుందా? వస్తే అందులో ఈ ఇద్దరు డాన్ లు కలసి నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ…!