Amit Shah:టాలీవుడ్ కు బీజేపీ కి అవినాభావ సంబంధం ఏమైనా ఉందా..? అని అనుమానిస్తున్నారు నెటిజన్లు.. టాలీవుడ్ స్టార్స్ ను బీజేపీ నేతలు భేటీ అవ్వడంతో ఇలాంటి అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. మొన్నటికి మొన్న ఎన్టీఆర్, ఆ తరువాత నితిన్, కొన్నిరోజుల్లో నిఖిల్.. ఇలా వరుస హీరోలను.. బీజేపీ నేతలు ఎందుకు కలుస్తున్నారు అనేది పెద్ద మిస్టరీగా కనపడుతోంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. త్వరలో అమిత్ షా- ప్రభాస్ తో భేటీ కానున్నరాట. అయితే ప్రభాస్ కలవడం వెనుక రాజకీయం ఏది లేదని తెలుస్తోంది. ఇటీవలే ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మృతి చెందిన విషయం విదితమే. కృష్ణంరాజు వాజ్ పేయ్ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ కుటుంబాన్ని అమిత్ షా పరామర్శించనున్నారు.
సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవానికి ముఖ్య అతిధిగా అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. ఇక సెప్టెంబర్ 16 న కృష్ణంరాజు సంస్కరణ సభ జరగనుంది. దీంతో హైదరాబాద్ వచ్చిన వెంటనే అమిత్ షా.. ప్రభాస్ ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించనున్నారట. ఆ తరువాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పూర్తిచేసి యంగ్ హీరో నిఖిల్ తో భేటీ కానున్నారని అంటున్నారు. ప్రభాస్ విషయం పక్కన పెడితే.. నిఖిల్ తో అమిత్ షా కార్తికేయ 2 గురించే మాట్లాడతాడా..? ప్రచారం కోసం రమ్మని అడుగుతాడా..? అనేది తెలియాల్సి ఉంది. ఏదిఏమైనా అమిత్ షా రాక ఎన్నో అనుమానాలకు దారి ఇస్తోంది.. మరి వాటన్నింటికి ఫుల్ స్టాప్ పడాలంటే ఇంకో మూడు రోజులు ఆగాల్సిందే.