నిర్మాతల కష్టాలు తెలిసినా కూడా కొందరు హీరోయిన్లు చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతూనే ఉన్నారు. అటు నార్త్ లోనూ, ఇటు సౌత్ లోనూ ఇప్పటికే పలువురు కథానాయికలు ఫిల్మ్ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టి చేతులు కాల్చుకున్నారు. అయితే కొందరు మాత్రం దీన్ని అసిధార వ్రతంలా స్వీకరించి, లాభనష్టాలతో నిమిత్తం లేకుండా ముందుకు సాగుతున్నారు. బట్.. అలాంటి హీరోయిన్స్ ను వేళ్ళ మీద లెక్కించాల్సిందే!
ఇంతకూ విషయం ఏమిటంటే… ప్రముఖ నటి అమలాపాల్ సైతం గత యేడాది ఫిల్మ్ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టింది. అమలాపాల్ ప్రొడక్షన్స్ పేరుతో ‘కడవర్’ అనే తమిళ చిత్రాన్ని నిర్మించింది. క్రిమినాలజీలో డాక్టరేట్ చేసిన పోలీస్ సర్జన్ డాక్టర్ భద్ర అనే పాత్రను అమలాపాల్ పోషించింది. ‘కడవర్’ నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం. కేరళలోని పోలీస్ సర్జన్ డాక్టర్ బి. ఉమాదత్తన్ తాను చేసిన పోస్ట్ మార్టమ్స్ ద్వారా ఎన్నో కేసులను సాల్వ్ చేశారు. పోలీసులకు కూడా చిక్కని నేరస్తుల్ని ఆయన పట్టించగలిగారు. 2019లో డాక్టర్ ఉమాదత్తన్ కన్నుమూశారు. ఆయన టేకప్ చేసిన కొన్ని కేసులను ఆధారంగా చేసుకుని రచయిత అభిలాష్ పిళ్ళై ‘కడవర్’ మూవీకి రచన చేశారు. నిజ జీవితంలోని పోలీస్ సర్జన్ పాత్రను వెండితెరపై అమలాపాల్ పోషించింది. అంతేకాదు తానే నిర్మాతగానూ వ్యవహరించింది.
విశేషం ఏమంటే… చక్కటి ప్లానింగ్ తో లిమిటెడ్ బడ్జెట్ లో, క్వాలిటీతో తీసిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఆగస్ట్ 12 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ దీన్ని డబ్ చేశారు. మొదటిసారి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన అమలాపాల్ చాలా వ్యూహాత్మకంగా తన చిత్రాన్ని నిర్మించింది. ఇందులో తెలుగువారికి సుపరిచితులైన నటులు బాగానే ఉన్నారు. పలు తెలుగు చిత్రాలలో హీరోగా నటించిన అరుణ్ అదిత్ కీలక పాత్రను పోషించగా, ఇక నెగెటివ్ షేడ్స్ ఉన్న డాక్టర్ సలీమ్ రెహ్మాన్ క్యారెక్టర్ ను రవిప్రకాశ్ చేశాడు. అమలాపాల్ కు సహాయం చేసే పాత్రను హరీశ్ ఉత్తమన్ పోషించగా, పలు తెలుగు చిత్రాల్లో నటించిన నిళల్ గళ్ రవి హాస్పిటల్ అధినేతగా కనిపించాడు. అలానే తమిళ, మలయాళ నటీనటులూ ఇందులో కీలక పాత్రలు పోషించడం వల్ల ఎవరికి వారు ఈ మూవీతో బాగానే కనెక్ట్ అవుతున్నారు. ఒకటి రెండు లాంగ్వేజెస్ కు పరిమితం కాకుండా డిస్నీ హాట్ స్టార్ లో ఏకంగా ఐదు భాషాల్లో మూవీ స్ట్రీమింగ్ కావడం అమలాపాల్ కు బాగానే కలిసొచ్చిన అంశం.
థియేట్రికల్ రిలీజ్ కు వెళ్ళి పబ్లిసిటీ, రెంట్స్ అంటూ కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండేది. బట్ ఆ భారం లేకుండా తాను తీసిన మొదటి సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కు ఇచ్చేసి అమలాపాల్ మంచి పని చేసిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ‘కడవర్’ అంటే శవం అని అర్థం. సో…. అమలాపాల్ ‘శవం’తో లాభసాటి వ్యాపారం చేసిందనే అనుకోవాలి!!