ఆప్త(అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియషన్) బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈవేడుకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంకా ఈకార్యక్రమంలో సూపూ కోటాన్, సాగర్ లగ్గిశెట్టి, రమేష్ తూము, మధు వల్లి, చంద్ర నల్లం, శ్రీనివాస్ చందు, శ్రీనివాస్ చిమట, విగయ్ గుడిసేవ, బాబీ అడ్డా, చలమశెట్టి అనీల్(గోపి) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ‘‘ఆప్త(అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియషన్) వారి ఆధ్వర్యంలో నడుస్తోన్న కేటలిస్ట్ ప్రోగ్రామ్ దేశ విదేశాల నుంచి ఎందరో హాజరయ్యారు. యంగ్ ఎంటర్‌ప్రెన్యూరర్స్‌ని ఎంకరేజ్ చేయటానికి అందరూ ఇక్కడకు రావటం ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి ఫలితం మన ప్రాంతం, మన రాష్ట్రం, మన దేశం, మనం ఉండే ఇతర దేశాలకు ఉపయోగపడుతుందనే విశాలమైన దృక్పథంతో ఈరోజు ఈవెంట్‌ను నిర్వహించారు. అమెరికా నుంచి ఇంత మంది ఇక్కడకు వస్తారా? అని అందరూ అనుకుంటారు. కానీ అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ ఇంత మంది ఇక్కడకు రావటం అనేది గొప్ప విషయం. అమెరికాలో ఉన్న మనం బాగుండటం కాదు, మన తెలుగు వారందరూ బాగుండాలనే సదుద్దేశంతో ఆప్త వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగటం విశేషం. కాలేజ్ చదువు అయిపోగానే మద్రాస్‌లో యాక్టింగ్ స్కూల్‌కి వెళతానని నాన్నగారికి చెప్పగానే అక్కడ మనకు ఎవరూ తెలియదురా.. అని అన్నారు. తెలియని ఫీల్డ్‌కు వెళ్లి రాణించగలవా? అని అన్నారు. అయితే నా మనసులో మాత్రం నేను తప్పకుండా రాణిస్తాననే గట్టి నమ్మకం అయితే ఉండింది. నేను యాక్టింగ్ స్కూల్‌లో ట్రైనింగ్ పూర్తి చేయక ముందే నాకు దర్శక నిర్మాతలు సినిమాల్లో అవకాశాలిచ్చారు.
ప్రారంభంలో లక్ష్య సాధనలో నిలదొక్కుకోవాలి. డబ్బు ప్రధాన కాదు. నిలబడ్డ తర్వాత డబ్బు దానంతట అదే వస్తుంది. నాతో పని చేయని వాళ్లు, మళ్లీ చిరంజీవితో సినిమా చేయాలి అనుకునేలా నా ప్రవర్తన ఉండేది. కాస్త తగ్గటం వల్ల వచ్చే వేవ్స్ ఆటోమెటిక్‌గా నన్ను పైకి తీసుకెళుతుంది. సినీ ఇండస్ట్రీలో టాలెంట్ అనేది సెకండరీ.. నిర్మాతలతో ఎలా ఉంటావు.. వాళ్లకు ఎలా సపోర్ట్ చేశావనేది చూసుకోవాలి. టాలెంట్‌తో పాటు బిహేవియర్ కూడా ఉండాలి. నా ప్రయాణంలో నేను ఇన్‌స్పిరేషన్‌గా ఎలాగైతే నిలిచానో ఇక్కడున్న వారందరూ భవిష్యత్తులో రాబోయే ఎంటర్‌ప్రెన్యూరర్స్‌కి ఇన్‌స్పిరేషన్‌గా నిలవాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, నా ఫ్యామిలీలోని నా బిడ్డలందరూ నా అచీవ్‌మెంటే. ఈ మధ్య ఓ పత్రిక కపూర్ ఫ్యామిలీ ఆఫ్ సౌత్ అని మా గురించి ప్రస్తావించినప్పుడు ‘భగవంతుడా! ఇది నా గొప్పదనం కాదు, నువ్వు, ప్రేక్షకులు, అభిమానులు ఇలా ఆదరించారు కాబట్టే ఇక్కడున్నామ’ని అనుకున్నాను. ఈ సందర్భంలో చలమశెట్టి అనీల్(గోపి)కి ప్రత్యేకమైన అభినందనలు’’ అన్నారు.