అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్‌కు హిట్ రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వ్యాఖ్యానించాడు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా సక్సెస్ మీట్‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. కరోనా కారణంగా ప్రజలు థియేటర్లకు రావాలంటే భయపడుతున్న సమయంలోనూ నాగచైతన్య, అఖిల్ అన్నదమ్ములు ఇద్దరూ హిట్ కొట్టారని బన్నీ అభినందించాడు. అక్కినేని అభిమానులకు ఇది గర్వకారణమన్నాడు. అఖిల్ ‘మనం’ సినిమాలో ఆయన తాతయ్య ఏఎన్ఆర్‌తో నటించడం ఎంతో చిరస్మరణీయమన్నాడు.
ఇక హీరోయిన్ పూజాహెగ్డే తనకే కాకుండా ఏ హీరోకు అయినా లక్కీ అని అల్లు అర్జున్ అభినందించాడు. బొమ్మరిల్లు, పరుగు సినిమాల తర్వాత భాస్కర్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కడం తనకు చాలా హ్యాపీగా ఉందన్నాడు. భాస్కర్‌పై తనకు చాలా నమ్మకం ఉందని.. ఆ నమ్మకాన్ని తాను నిలబెట్టుకున్నాడని బన్నీ అన్నాడు. ఇక కరోనా కారణంగా అందరూ నిర్మాతల తరహాలో తన నాన్న అల్లు అరవింద్ కూడా ఫైనాన్షియల్ ఒత్తిడి అనుభవించారని, ఆయన తలుచుకుంటే ఈ సినిమాను ఓటీటీ ఛానల్ ద్వారా విడుదల చేయవచ్చని.. కానీ థియేటర్లలోనే విడుదల చేయాలని పట్టుబట్టి మరీ విడుదల చేసి హిట్ కొట్టినందుకు ఆనందంగా ఉందని బన్నీ పేర్కొన్నాడు.