Allu Aravind: టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా నిర్మాతగా కొనసాగుతున్నారు అల్లు అరవింద్. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఎన్నో మంచి సినిమాలను టాలీవుడ్ కు అందిస్తున్నారు. ఇక నిత్యం సినిమాలతో బిజీగా ఉండే అల్లు అరవింద్ మొదటిసారి ఒక టాక్ షో లో పాల్గొన్నారు. ఆలీ హోస్ట్ చేస్తున్న ఒక షో లో అల్లు అరవింద్ పాల్గొని మొట్టమొదటిసారి తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా చిరంజీవి తో తనకున్న అనుబంధం, చిరు తన ఇంటికి అల్లుడు ఎలా అయ్యారు అనేది చెప్పుకొచ్చాడు.
” చిరంజీవి గారిని నేను మొదటిసారి చలసాని గోపి ఆఫీసుకు వెళ్ళినప్పుడు కలిశాను. ఆయనే నాకు చిరంజీవి గారిని పరిచయం చేశారు. అప్పుడు ఇద్దరం షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాం.. ఆ హ్యాండ్ ఇప్పటివరకు వస్తుందని అనుకోలేదు. ఇక చిరంజీవి గారు మా ఇంటి అల్లుడు కావడానికి ప్రధాన కారణం మా అమ్మ. మా ఇంటి పైన సత్యనారాయణ అనే ఆయన ఉండేవాడు. ఒకసారి చిరంజీవి గారు ఆయనను కలవడానికి ఇంటికి వచ్చారు. ఆయన వెళ్ళాకా అమ్మ, అతను ఎవరు అని సత్యనారాయణను అడిగితే అతను చిరంజీవిగారి గురించి చెప్పాడు. వెంటనే మా అమ్మ మన వాడేనా అని అడిగింది. ఇక రాత్రికి నాన్న ఇంటికి రాగానే చిరంజీవి గారి గురించి చెప్పి విసిగించింది. నాన్న అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. అయినా అమ్మ వినకుండా పోరుపెడుతూనే ఉంది. ఇక ఆ తరువాత మనవూరి పాండవులు సినిమా కోసం నాన్న, చిరంజీవి గారు 20 రోజులు రాజమండ్రి లో ఉన్నారు. ఆ సమయంలో చిరంజీవి గారిపై నాన్న సీఐడీ వర్క్ మొదలుపెట్టారు. ఈ విషయం ఇప్పటివరకు చిరంజీవి గారికి కూడా తెలియదు. ఇక ఆయన మంచివారని నాన్న నమ్మడంతో చిరంజీవి గారు మా ఇంటి అల్లుడు అయ్యారు” అని చెప్పుకొచ్చారు.