నిఖిల్, చందు మొండేటి కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ‘కార్తికేయ -2’. ఈ మూవీ శనివారం విడుదలై విజయపథంలో సాగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, ” ‘కార్తికేయ -2’ మూవీ చాలా బాగుంది. చిన్న చిన్న అంశాలకు సైతం ఎంతో ప్రాధాన్యమిచ్చారు. హీరోహీరోయిన్స్ మధ్య రొమాన్స్ లేకపోయినా… కథ ఆసక్తికరంగా రక్తికట్టింది. అలానే గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అన్నీ ఈ సినిమాకు చక్కగా కుదిరాయి. ఈ సినిమా సక్సెస్ ను నేను బాగా ఎంజాయ్ చేస్తున్నా. ఎందుకంటే అందులో నా స్వార్థం కూడా ఉంది. హీరో నిఖిల్ తో మేం ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నాం. అలానే చందు మొండేటి మా బ్యానర్ లో మూవీ చేయడానికి ఏడెనిమిది నెలలుగా వర్క్ చేస్తున్నాడు. మా సినిమాలో నటించమని హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ నూ కోరాను. ఇలా ఈ చిత్రంలో నటించిన వారంతా నా భవిష్యత్ ప్రాజెక్ట్ లకు సంబంధించిన వారు కావడంతో వారి విజయం మాకు కొత్త బూస్టప్ ను ఇస్తుందని ఆనందిస్తున్నాను” అని అన్నారు. హిందీలో మూవీని డబ్ చేసి సరదాగా విడుదల చేస్తే.. అది ఇవాళ అక్కడ భారీ కలెక్షన్లను వసూలు చేసే దిశగా సాగుతోందని అల్లు అరవింద్ కితాబిచ్చారు. రెండు హిందీ సినిమాలతో పోటీ పడుతూ, ఈ సినిమా 30 థియేటర్లలో విడుదలై రెండో రోజుకు 200 థియేటర్లకు పెరిగి ఇవాళ 700లకు పైగా థియేటర్లలో ఉత్తరాదిన ప్రదర్శితమౌతోందని, తమ ‘పుష్ప’ సినిమా సైతం అప్పుడు ఇలానే ఉత్తరాదిలో ఇరగకొట్టిందని అల్లు అరవింద్ ఆనందంగా చెప్పారు. ‘బింబిసార, సీతారామం, కార్తికేయ -2’ వంటి చిత్రాల విజయంతో తమకు బోలెడంత ధైర్యం వస్తోందని అల్లు అరవింద్ అన్నారు.