‘ఖిలాడీ’ అక్షయ్ కుమార్ నిజంగానే ఆ పేరు సార్థకం చేసుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. సినిమాల సక్సెస్, వాటి కలెక్షన్స్ ను కూడా ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితి ఏర్పడంది. పైగా విషపూరిత ప్రచారాలకు సోషల్ మీడియా వేదికగా మారి చాలా రోజులయింది. ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్ తాను నటించిన మూడు రీమేక్ మూవీస్ ను నేరుగా ఓటీటీలో విడుదల చేయడానికి నిర్ణయించుకోవడం ఇప్పుడు విశేషంగా మారింది.
తమిళ ‘రాక్షసన్’ ఆధారంగా ‘మిషన్ సిండ్రెల్లా’, మళయాళ ‘డ్రైవింగ్ లైసెన్స్ ‘ సినిమా రీమేక్ గా ‘సెల్ఫీ’ చిత్రాలు అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కాయి. వీటితో పాటు తమిళంలో సూర్య నటించి, నేరుగా ఓటీటీలో విడుదలచేసిన ‘సూరారై పొట్రు’ చిత్రాన్ని కూడా అక్షయ్ కుమార్ రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సైతం ఓటీటీలోనే విడుదల చేయాలని అక్కీ భాయ్ నిశ్చయించాడు. ఉత్తరాదిన సైతం మన దక్షిణాది చిత్రాలు అనువాదమై వీరవిహారం చేస్తున్నాయి. దాంతో బాలీవుడ్ బాబులు కుతకుత ఉడికిపోతూ ద్వేషపూరితమైన కామెంట్స్ ఆరంభించారు. వారికి దీటుగా కొందరు సౌత్ సినిమా జనం కూడా అదే తీరున స్పందించారు. ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్ తాను నటించిన మూడు సౌత్ రీమేక్స్ ను ఓటీటీలోనే నేరుగా విడుదల చేయడం సబబని భావించినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా నార్త్, సౌత్ అంటూ తేడాలు పొడసూపినపుడు థియేటర్లలో సినిమాలు రిలీజ్ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో ఊహించవచ్చు.
పైగా సదరు చిత్రాలు సౌత్ రీమేక్స్, ఏ మాత్రం నచ్చకపోయినా దక్షిణాదిన ఢమాల్ అంటాయి. పైగా బాలీవుడ్ లో కొన్ని ఏళ్ళుగా సూపర్ కలెక్షన్స్ చూస్తూ సాగుతున్నాడు అక్షయ్ కుమార్. ఒకవేళ ఈ మూడు సినిమాలు తేడా కొడితే, అక్కీ ఇమేజ్ కూ భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. అందువల్లే అక్షయ్ కుమార్ నిర్ణయం భలేగా ఉందని, అందుకే ‘ఖిలాడీ ఖిలాడియే’ అంటున్నారు ముంబయ్ సినీజనం.