Akhil Akkineni:అక్కినేని అఖిల్ ను చూస్తే అభినయంపై అతనికి తరగని తపన ఉందనిపిస్తుంది. ఎంతయినా మహానటుడు ఏయన్నార్ మనవడు. కింగ్ నాగార్జున ముద్దులకొడుకు. నాగచైతన్యకు ప్రియమైన తమ్ముడు. వీరందరి స్ఫూర్తితోనే అఖిల్ అభినయ పర్వంలో సాగుతున్నాడు. ఆ మాటకొస్తే అక్కినేని అభినయ కుటుంబంలో అతి పిన్నవయసులోనే తెరపై కనిపించి, అలరించిన ఘనత అఖిల్ సొంతమని చెప్పాలి! ఏడాది వయసులోనే అఖిల్ ‘సిసింద్రీ’గా జనాన్ని మెప్పించాడు. అప్పటి నుంచీ అక్కినేని ఇంట మరో ప్రతిభావంతుడు పుట్టాడని జనం భావించారు. దోగాడే పసిపాపగా ఉన్న రోజుల్లోనే అలరించిన అఖిల్ కథానాయకునిగానూ మెప్పిస్తాడని అభిమానులు ఆశించారు. ఎందుకనో వారి ఆశలు ఆరంభంలో అంతగా ఫలించలేదు. మూడు చిత్రాల తరువాత ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’గా జనం ముందు నిలచి తొలి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు అఖిల్. ఇప్పుడు ‘ఏజెంట్’గా మురిపించే ప్రయత్నంలో ఉన్నాడు అఖిల్. నిజానికి ‘ఏజెంట్’ గత సంవత్సరమే వెలుగు చూడాలి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ యేడాది ఏప్రిల్ 28న ‘ఏజెంట్’గా జనాన్ని పలకరించబోతున్నాడు అఖిల్.
అఖిల్ అక్కినేని 1994 ఏప్రిల్ 8న కాలిఫోర్నియాలోని శాన్ జోస్ లో జన్మించాడు. అక్కినేని నాగార్జున, అమల దంపతుల నోముల పంటగా జన్మించిన అఖిల్ సంవత్సరం వయసులోనే ‘సిసింద్రీ’ చిత్రంలో నటించి అలరించాడు. ఆ తీరును ఇప్పటికీ అభిమానులు మరచిపోలేరు. అమ్మ అమల, నాన్న నాగార్జున – ఇద్దరూ తెరపై మేటి నటీనటులుగా వెలిగారు. వారి జీన్స్ అఖిల్ ను సినిమా రంగంవైపే పరుగులు తీయించాయి. చిత్రసీమలోకి యంగ్ హీరోగా అడుగుపెట్టక ముందు అఖిల్ క్రికెట్ లో భలేగా రాణించాడు. ఆస్ట్రేలియా వెళ్ళి క్రికెట్ లో మరీ శిక్షణ తీసుకున్నాడు. ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్ కోసం టాలీవుడ్ స్టార్స్ క్రికెట్ ఆడిన సమయంలో అఖిల్ కూడా బ్యాటింగ్ చేసి జనాన్ని ఆకట్టుకున్నాడు. అప్పట్లో అఖిల్ ఏ జట్టులో ఉంటే ఆ టీమ్ గెలుస్తుందని సినీజనం భావించేవారు.
అఖిల్ క్రికెట్ లో అలరించింది మొదలు అక్కినేని అభిమానులు అఖిల్ ను తెరపై చూడాలని ఆశిస్తూనే ఉన్నారు. అభిమానుల కోరిక తీర్చడానికి అన్నట్టు అక్కినేని హీరోలు అందరూ కలసి నటించిన ‘మనం’ చిత్రంలో తాత, తండ్రి, అన్నతో కలసి ఓ సీన్ లో కాసేపు కనిపించాడు. అందులో అఖిల్ ఎంట్రీ చూసిన అభిమానులు ఆనందంతో చిందులు వేశారు. తరువాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో అఖిల్ సోలో హీరోగా ‘అఖిల్’మూవీతో ప్రేక్షకుల ముందు నిలిచాడు. ఆ పై ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’ సినిమాల్లోనూ అఖిల్ నటించినా, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’తోనే తొలి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత వస్తున్న ‘ఏజెంట్’పై మొదటి నుంచీ అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి. దర్శకుడు సురేందర్ రెడ్డి స్టైల్ ఆఫ్ మేకింగ్ ఈ ‘ఏజెంట్’కు ఓ ఎస్సెట్. మరి ఏయన్నార్ మనవడు ‘ఏజెంట్’గా ఏ తీరున మెప్పిస్తారో చూడాలి!