‘అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా…’ అని శ్రీదేవిని చూసి అన్నారు కానీ, నిజానికి ఆ పదాలు ఐశ్వర్యారాయ్ కి భలేగా సరితూగుతాయి – ఇదీ అప్పట్లో ఎంతోమంది రసపిపాసుల మాట! విశ్వసుందరి కాలేకపోయింది, ప్రపంచసుందరిగానే ఐశ్వర్యారాయ్ అందం బంధాలు వేసింది. విశ్వసుందరిగా నిలచిన సుస్మితా సేన్ కన్నా మిన్నగా ఐశ్వర్యారాయ్ అందం జనాన్ని ఆకర్షించింది.
మోడల్ గా ఉన్న సమయంలోనే ఐశ్వర్య అందాన్ని చూసి, ‘దివి నుండి దిగివచ్చిన తారక…’ అనుకున్నారు జనం. వెండితెరపై నటిగా వెలగగానే, తమ అభిప్రాయంలో ఏ మాత్రం పొరపాటు లేదని భావించి, జేజేలు పలికారు. ‘ఐశ్వర్య ఓ అందాల అయస్కాంతం’ అనీ కితాబు నిచ్చిన వారెందరో ఉన్నారు. ఈ నాటికీ ఐశ్వర్య అందం కనువిందు చేస్తూనే ఉంది. సినిమాల్లో అంతగా నటించకపోయినా, ఆమె నటించిన చిత్రాల్లో మాత్రం అందంతో బంధం వేయడం మానుకోలేదు ఐశ్వర్య.
ఐశ్వర్యారాయ్ 1973 నవంబర్ 1న కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది. మెరుపుతీగెలాంటి మేని సొగసుతో ఐశ్వర్యారాయ్ యాడ్ ప్రపంచంలో తనదైన బాణీ పలికించింది. ఆపై ‘మిస్ ఇండియా’ టైటిల్ పోటీలో రన్నరప్ గానే నిలచింది. అయినా, తన అందంపై నమ్మకంతో మళ్ళీ అందాలపోటీల్లో సాగింది. 1994 మిస్ వరల్డ్ గా ఐశ్వర్య నిలచింది. చిత్రమేమిటంటే, మిస్ యూనివర్స్ గా నిలచిన సుస్మితా సేన్ కన్నా మిన్నగా ఐశ్వర్యారాయ్ కు సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ, సరైన చిత్రంతో ముందుకు సాగాలని ఆమె ఆశించారు.
ఆ సమయంలోనే మణిరత్నం ‘ఇరువర్’ తెరకెక్కిస్తూ అందులో నాయికగా ఐశ్వర్యను ఎంచుకున్నారు. తొలి చిత్రంలో రెండు విభిన్న పాత్రలను పోషించి భళా అనిపించింది ఐశ్వర్య. ఆ సినిమా పరాజయం పాలయింది. హిందీలో నటించిన తొలి చిత్రం ‘ఔర్ ప్యార్ హోగయా’ కూడా ఐశ్వర్య అందం మెరుపులకు తగ్గ విజయాన్ని అందించలేకపోయింది. ఆ సమయంలో శంకర్ తన ‘జీన్స్’లో ఐశ్వర్యారాయ్ తో వైవిధ్యమైన పాత్రను పోషింప చేశారు. ‘జీన్స్’ ఘనవిజయంతో ఐశ్వర్యారాయ్ అందం చిందులు వేసింది. ఆమె డేట్స్ కోసం సినీజనం క్యూ కట్టడం మొదలయింది.
సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్ కాంబినేషన్ లో రూపొందిన ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ సినిమా ఐశ్వర్యను మరింత ముందుకు తీసుకు వెళ్ళింది. ఆ చిత్రంలో ఐశ్వర్య ధరించిన దుస్తులను చూడటం కోసం అమ్మాయిలు పరుగులు తీశారు. యువకులు ఆ ప్రేమకథా చిత్రాన్ని వీక్షించి, పులకించి, ఐశ్వర్యను తమ స్వప్నసుందరిగా పట్టాభిషేకం చేసుకున్నారు.
తెలుగు చిత్రం ‘రావోయి చందమామా’లో నాగార్జునతో కలసి “లవ్ టు లివ్…” అనే పాటలో నర్తించి మురిపించింది ఐసు. ఈ పాట కోసం అప్పట్లో ఆమె భారీ పారితోషికం అందుకుందని చెప్పేవారు. ఇక ఈ పాట చిత్రీకరణ అన్నపూర్ణ స్టూడియోలో నాలుగు రోజులు చిత్రీకరణ జరుపుకోగా, అన్ని రోజులూ ఆమెను చూడటానికి సినీజనమే క్యూ కట్టడం చూస్తే, తెలుగునాట ఆమెకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో అర్థమయింది. ఆ తరువాత తెలుగులో ఆమె ఏ చిత్రంలోనూ కనిపించక పోయినా, ఆమె నటించిన హిందీ సినిమాలు, అనువాద చిత్రాలు తెలుగు జనాన్ని ఆకట్టుకున్నాయి.
“తాళ్, మేలా, జోష్, హమారే దిల్ ఆప్కే పాస్ హై, మొహబ్బతే, దేవ్ దాస్, ఖాకీ, క్యు హోగయా నా, ధూమ్ -2, జోధా అక్బర్, సర్కార్ రాజ్, గుజారిష్, యే దిల్ హై ముష్కిల్” వంటి హిందీ చిత్రాలలో ఐశ్వర్యారాయ్ అందాలతో బంధాలు వేసింది. అభినయంతోనూ కట్టి పడేసింది. తమిళంలో ఆమె నటించిన ‘యందిరన్’ తెలుగులో ‘రోబో’గా ఘనవిజయం సాధించింది. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ తో కలసి ‘బంటీ ఔర్ బబ్లీ’లో “కజ్రారే…” సాంగ్ లో ఐశ్వర్యారాయ్ అందాలతో చేసిన కనువిందును ఎవరూ మరచిపోలేరు. భర్త అభిషేక్ తో కలసి ఆమె నటించిన మణిరత్నం ‘గురు’ సైతం ఆకట్టుకుంది.
“బ్రైడ్ అండ్ ప్రెజుడైస్, ద మిస్ట్రెస్ ఆఫ్ స్పైసెస్, ప్రొవోక్డ్, ద లాస్ట్ లెజియన్, ద పింక్ పాంథర్-2” వంటి ఇంగ్లిష్ సినిమాల్లోనూ ఐశ్వర్య తన అందాల అభినయంతో మురిపించింది. ఆ మధ్య వచ్చిన ‘యే దిల్ హై ముష్కిల్’లో ఐశ్వర్య అందం చూసి, పెళ్ళయ్యాక ఆమెలో మరింత ఆకర్షణ పెరిగిందని అన్నారు జనం. ప్రస్తుతం ఓ బిడ్డ తల్లయిన తరువాత కూడా ఐశ్వర్య మునుపటి కన్నా మిన్నగా ఆకర్షిస్తూనే ఉంది. ప్రస్తుతం మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’లో నటిస్తోంది ఐశ్వర్య. ఆమె ఏ సినిమాలో నటించినా, చూడటానికి జనం సిద్ధంగా ఉన్నారు. మరి రాబోయే చిత్రాలలో ఐశ్వర్య అందం ఏ తీరున బంధాలు వేస్తుందో చూడాలి.