Mandakini: నూరుశాతం లోకల్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఇప్పుడు డైలీ సీరియల్స్ కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఫస్ట్ డైలీ సీరిస్ గా వచ్చిన ‘మిస్టర్ పెళ్ళాం’ సక్సెస్ ను కొనసాగిస్తూ, ఇప్పుడు సోషియో ఫాంటసీ థ్రిల్లర్ ‘మందాకిని’ మొదలైంది. మార్చి 6న తొలి నాలుగు ఎపిసోడ్స్ ను స్ట్రీమింగ్ చేశారు. వీటికి వీక్షకులు, విమర్శకుల నుండి చక్కటి ప్రశంసలు వస్తున్నాయి. టీవీ రంగానికి చెందిన ప్రముఖులు నిరుపమ్ పరిటాల, వాసుదేవరావు వంటి వారు ఈ సీరిస్ ను మెచ్చుకుంటూ, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
కథ విషయానికి వస్తే… ఆర్య (ఆర్.కె. చందన్) ఓ యాడ్ ఫిల్మ్ మేకర్. అతనికి కలలో మందాకిని (హిమబిందు) కనిపిస్తూ ఉంటుంది. మొత్తానికి ఓ రోజున ఆమెను కలుస్తాడు. అయితే అప్పటికే మందాకిని ఓ శాపానికి గురై ఉంటుంది. తెలంగాణలోని మారుమూల గ్రామంలోని పురాతన దేవాలయంలో మందాకినితో కలిసి ఆర్య పూజలు నిర్వహిస్తే ఆ శాపం తొలగిపోతుందని తెలుస్తుంది. కానీ కళింగ వర్మ (మిథున్) అనే ఓ వ్యక్తి వీరిని ఆ పూజలు చేయకుండా అడ్డుకుంటూ ఉంటాడు. వాటిని అధిగమించే క్రమంలో ఆర్యకు ఈ శాపానికి కారణంతో పాటు వేదవతి (జయలలిత) కుటుంబానికి సంబంధించిన వివరాలు తెలుస్తాయి. అవి ఏమిటీ? మందాకిని శాపవిమోచనం ఎలా జరిగింది? అనేది ఈ ఫాంటసీ సస్పెన్స్ థ్రిల్లర్ సీరిస్ మిగతా కథ. ఆర్. కె. చందన్, హిమబిందు, మిధున్, జయలలిత, సాయికిరణ్, వర్ష, ప్రియా హెగ్డే, నాగిరెడ్డి తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ డైలీ సీరిస్ ను ఆర్.కె. మలినేని డైరెక్ట్ చేశారు. దీనికి శ్రీనివాస్ మండల కథను అందించగా, ఆసం శ్రీనివాస్ మాటలు రాశారు. వరుణ్ చౌదరి గోగినేని ఈ డైలీ సీరిస్ ను నిర్మించారు. తొలి ఎనిమిది ఎపిసోడ్స్ ను ఉచితంగా చూసే అవకాశాన్ని ఆహా సంస్థ కల్పిస్తోంది. వాటిని చూసిన తర్వాత తప్పనిసరిగా ఆహా సబ్ స్క్రిప్షన్ చేసి మిగిలిన భాగాలను వీక్షిస్తారన్నది సంస్థకున్న నమ్మకం.