విలక్షణమైన కథలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అడివి శేష్. కేవలం హిట్లు కొట్టడమే కాదు, కంటెంట్ ఉన్న సినిమాలు చేయడమే తన లక్ష్యమని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు. తాజాగా తన కొత్త సినిమా ప్రమోషన్లలో భాగంగా ‘ట్యాగ్స్’ (బిరుదులు) గురించి అడివి శేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ మధ్యకాలంలో ఒకట్రెండు హిట్ రాగానే హీరోలు తమ పేర్ల ముందు రకరకాల బిరుదులు తగిలించుకోవడం, పీఆర్ టీమ్‌లతో వాటిని వైరల్ చేయించుకోవడం ఒక ట్రెండ్‌గా మారింది. దీనిపై శేష్ చాలా సూటిగా స్పందించారు.
Also Read : Johnny Master Case : జానీ మాస్టర్ కేసులో షాకింగ్ ట్విస్ట్..
“నాకు అందరిలాగా ట్యాగ్‌లు పెట్టుకోవడం ఇష్టం లేదు. ఒక ట్యాగ్ పెట్టుకుని, దానికి ఒక లోగో డిజైన్ చేసి, పీఆర్ టీమ్‌ని పెట్టి బలవంతంగా జనాల్లోకి తీసుకెళ్లడం నా వల్ల కాదు. చిన్నప్పుడే మా అమ్మానాన్న నాకు ‘అడివి శేష్’ అనే ట్యాగ్ ఇచ్చారు, నా కెరీర్‌కు అదే సరిపోతుంది” అంటూ ఆయన తేల్చి చెప్పారు. బిరుదుల కంటే తరతరాలు గుర్తుండిపోయే సినిమాలు చేయడమే తనకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు విన్న నెటిజన్లు.. ‘అడవి శేష్ ట్యాగుల పిచ్చి ఉన్న హీరోలకు గట్టి కౌంటర్ ఇచ్చారు’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. పేరు కంటే పనికే ప్రాధాన్యత ఇచ్చే శేష్ ఆలోచనను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.