Adivi Sesh: అడివి శేష్ హీరోగా ప్రశాంతి త్రిపిరనేనితో కలిసి హీరో నాని నిర్మించిన ‘హిట్ -2’ మూవీ సెన్సార్ కార్యక్రమాలను శుక్రవారం పూర్తి చేసుకుంది. దర్శకుడు శైలేష్ కొలను ఎంచుకున్న కంటెంట్ కారణంగా దీనికి ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమాకు ఇలాంటి ఇబ్బంది కలుగుతుందని దర్శక నిర్మాతలు ముందే గెస్ చేశారు. ఎందుకంటే… యూ ట్యూబ్ లో ట్రైలర్ విడుదలైనప్పుడే అందులోని కంటెంట్ కారణంగా అవాంతరాలు ఎదురయ్యాయి. యూ ట్యూబ్ స్ట్రీమింగ్ ను హఠాత్తుగా ఉపసంహరించుకుంది. ఆ తర్వాత 18 సంవత్సరాల పైబడిన వారే ఈ దీన్ని చూడాలనే హెచ్చరికతో తిరిగి స్ట్రీమింగ్ చేసింది. ఇప్పుడు సినిమాకూ అదే వర్తింప చేస్తూ సెన్సార్ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 2న విడుదల కాబోతున్న ‘హిట్ -2’ నిడివి విషయంలో మాత్రం మేకర్స్ జాగ్రత్త తీసుకున్నారు. కేవలం రెండు గంటలకే మూవీని పరిమితం చేశారు. ఇది తెలివైన పని. ఇలాంటి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ నిడివి ఎంత తక్కువ ఉంటే అంత చకచకా సాగిపోయిన భావన ఆడియెన్స్ కు కలుగుతుంది.
‘హిట్ -2′ గురించి ఆ మధ్య అడివి శేష్ మాట్లాడుతూ, ”’హిట్-2’ విడుదల సమయంలోనే శ్రద్ధావాకర్ హత్య జరగడం, దానికి సంబంధించిన వార్తలు మీడియాలో హల్చల్ చేయడం కో-ఇన్సిడెన్స్ అని అన్నారు. ఎందుకుంటే ఇందులోనూ అదే తరహాలో ఓ హత్య జరుగుతుంది. దానికి సంబంధించిన విచారణ చేస్తున్నప్పుడు అది ఒక హత్య కాదు సీరిస్ ఆఫ్ మర్డర్స్ అనే విషయం హీరోకి బోధపడుతుంది. ఆ రకంగా చూస్తే… ‘హిట్’ ను మించిన టెంపో, వయొలెన్స్, యాక్షన్ దీనిలో ఉన్నాయని అర్థమౌతోంది. మూవీ ప్రమోషన్స్ ప్రారంభించినప్పుడు కూడా దర్శకుడు శైలేష్ కొలను… ‘అన్ని విషయాలలోనూ ‘హిట్-2’ అంతకు మించి అన్నట్టుగా ఉంటుందని చెప్పనే చెప్పారు. ఈ యేడాది ఇప్పటికే ‘మేజర్’తో జాతీయ స్థాయిలో సినీ ప్రేక్షకులను మెప్పించిన అడివి శేష్, ‘హిట్ -2’తో ఎలాంటి ప్రశంసలు అందుకుంటాడో చూడాలి.