టాలీవుడ్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. పవన్ కళ్యాణ్, రానా జంటగా నటిస్తున్న ఈ సినిమా 2022 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. “భీమ్లా నాయక్” టీజర్ ఇంటర్నెట్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో విషయం బయటకు వచ్చింది. ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ “భీమ్లా నాయక్” ఆడియో హక్కులను సొంతం చేసుకుంది.
ఈ మూవీ సౌండ్‌ట్రాక్‌ను స్వరకర్త థమన్ స్వరపరిచారు. ఇటీవల కాలంలో ఆయన అందించిన మ్యూజిక్ శ్రోతలను విశేషంగా అలరిస్తున్న విషయం తెలిసిందే. టీజర్లోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దుమ్ము రేపింది. “భీమ్లా నాయక్” మొదటి సింగిల్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజున అంటే సెప్టెంబర్ 2న ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆదిత్య మ్యూజిక్ ఈ సినిమా ఆడియో హక్కులను పొందడానికి భారీగా చెల్లించింది అంటున్నారు.
ఈ “భీమ్లా నాయక్”లో నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, మాటలు రాశారు. ఎస్ రాధాకృష్ణ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. “భీమ్లా నాయక్” సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.