నటుడు విజయ్ చందర్ పేరు వినగానే చప్పున ఈ నాటికీ ‘కరుణామయుడు’ విజయ్ చందర్ అంటూ జనం గుర్తు చేసుకుంటారు. ఏసుప్రభువు జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన ‘కరుణామయుడు’ చిత్రాన్ని నిర్మించి, ఏసు పాత్రలో నటించి, అరుదైన విజయాన్ని సొంతం చేసుకున్నారు విజయ్ చందర్. అప్పటి నుంచీ జనం మదిలో ఆయన ‘కరుణామయుడు’ విజయ్ చందర్ గానే నిలచిపోయారు. తెలుగునాట యన్టీఆర్ తరువాత పురాణ,చారిత్రక పాత్రల్లో మేటి అనిపించుకున్న ఘనుడు విజయ్ చందర్. తెలుగుతెరపై ఏసుక్రీస్తు జీవితాన్ని తొలిసారి ఆవిష్కరించిన ఘనత సైతం విజయ్ చందర్ సొంతం. ఆ తరువాత కూడా “రాజాధిరాజు, దయామయుడు” వంటి చిత్రాలలోనూ ఏసుక్రీస్తు పాత్రల్లో మెప్పించారు విజయ్ చందర్.
‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులుకు మనవడు అవుతారు విజయ్ చందర్. ప్రకాశం పంతులు జీవితగాథతో ‘ఆంధ్రకేసరి’ తెరకెక్కించి అలరించారు చందర్. ఇక ‘షిర్డీ సాయిబాబా మహాత్మ్యం’లో షిరిడీ సాయిబాబా పాత్ర పోషించి ఎంతగానో ఆకట్టుకున్నారు. ‘వేమన చరిత్ర’లో వేమనగానూ మురిపించారు. ‘పిలిస్తే పలుకుతా’ వంటి సాంఘిక చిత్రంలోనూ సాయిబాబాగా నటించారు. ఏసుక్రీస్తు పాత్ర పోషణతో విజయ్ చందర్ కు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. అయితే మామూలు సినిమాల్లో మాత్రం ఆయన అంతగా అలరించలేకపోయారు. ఏయన్నార్, ఆదుర్తి సుబ్బారావు కలసి నిర్మించిన “సుడిగుండాలు” ద్వారా చిత్రసీమలో ప్రవేశించారు విజయ్ చందర్. తరువాత కొన్ని చిత్రాలలో మంచి పాత్రలే లభించాయి. ‘సి.ఐ.డి.రాజు’లో హీరోగానూ నటించారు. అయితే అవేవీ, ఆయన కోరుకున్న స్టార్ డమ్ ను సంపాదించి పెట్టలేదు. ఆ సమయంలోనే బైబిల్ ఆధారంగా ఏసుక్రీస్తు గాథను తెరకెక్కించే ప్రయత్నం చేశారు. ఎందరో నిరుత్సాహ పరచినా, విజయ్ చందర్ ముందుకే సాగారు. పలు ప్రయాసలకు ఓర్చి ‘కరుణామయుడు’ చిత్రాన్ని పూర్తి చేశారు. ఏ.భీమ్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ‘కరుణామయుడు’ విడుదలై విజయఢంకా మోగించింది. విజయ్ చందర్ నటజీవితంలో మళ్ళీ ఆ స్థాయి విజయం లభించలేదు. విజయ్ చందర్ తెరకెక్కించిన ‘దయాసాగర్’ బుల్లితెర సీరియల్ విశేషాదరణ చూరగొంది. పలు భాషల్లోకి అనువాదం అయింది.
కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతగానో అభిమానించే విజయ్ చందర్, అప్పట్లో యన్టీఆర్ ‘తెలుగుదేశం’ పార్టీకి వ్యతిరేకంగానూ ప్రచారం చేశారు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అంటే విజయ్ చందర్ కు ఎంతో గౌరవం. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి కాగానే విజయ్ చందర్ ను ఎఫ్.డి.సి అధ్యక్షునిగాచేశారు. సినిమాల్లో యన్టీఆర్ ను గౌరవించే విజయ్ చందర్, రాజకీయాల్లో మాత్రం వ్యతిరేకించేవారు. కానీ, యన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం ‘యన్టీఆర్ – కథానాయకుడు’లో విజయ్ చందర్ నటించడం విశేషం. కూకట్ పల్లిలో తన సొంత స్థలాన్ని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో వృద్ధకళాకారుల కోసం ఇచ్చారు విజయ్ చందర్. మే 24తో 82 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న విజయ్ చందర్ మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగాలని ఆశిద్దాం.
(మే 24న నటుడు, దర్శకనిర్మాత విజయ్ చందర్ పుట్టినరోజు)