మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటించిన ‘ఆచార్య’ చిత్రంలోని “భలే భలే బంజారా…” పాట సోమవారం సాయంత్రం విడుదలవుతోందని తెలిసిన దగ్గర నుంచీ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూశారు. వారి ఆసక్తికి తగ్గట్టుగానే పాట కాకరేపుతోంది.”చీమలు దూరని చిట్టడివికి చిరునవ్వొచ్చింది… నిప్పు కాక రేగింది…” అంటూ పాట మొదలవుతుంది. పాటలో చిరంజీవి, రామ్ చరణ్ ఒకే రకమైన కాస్ట్యూమ్స్ ధరించడమే కాదు, డాన్సుల్లోనూ ఒకే స్టైల్ చూపించడం అభిమానులకు ఆనందం పంచే విషయం! “భలే భలే బంజారా… మజ్జా మందేరా… రెచ్చి పోదాం రా…” అంటూ సాగే ఈ పాట నిస్సందేహంగా అభిమానులను రెచ్చిపోయేలా చేస్తుందనవచ్చు.
పాట మధ్య మధ్యలో షూటింగ్ స్పాట్ కట్స్ ను ఇన్ సర్ట్ చేయడంతో తండ్రీకొడుకుల అనుబంధం చూసి ఫ్యాన్స్ మరింత సంతోషిస్తారని చెప్పవచ్చు. ఈ చిత్రానికి చిరంజీవి శ్రీమతి సురేఖ సమర్పకురాలు కాబట్టి, షూటింగ్ స్పాట్ లోనూ ఆమె కూడా సెట్స్ పై కనిపించడం విశేషం! ఇక శేఖర్ మాస్టర్ తండ్రీకొడుకులకు నృత్యభంగిమలు చూపించడం, వాటిని చిరంజీవి, రామ్ చరణ్ అవలీలగా చేసేయడం కూడా సెట్స్ విజువల్స్ లో కనిపిస్తుంది.
మణిశర్మ బాణీలకు ‘సరస్వతీపుత్ర’ రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను శంకర్ మహదేవన్, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. తిరునావుక్కరుసు సినిమాటోగ్రఫీలో ఈ పాట తెరకెక్కింది. ఈ పాటలోని పదాలు, వాటికి తగ్గట్టుగా చిరంజీవి, రామ్ చరణ్ తమ అడుగులు వేసిన తీరు ఇట్టే ఆకట్టుకుంటాయి. ‘ఆచార్య’ నుండి విడుదలైన పాటలు ఇప్పటికే కొన్ని అలరిస్తూ ఉన్నాయి. వాటిలాగే ‘భలే భలే బంజారా…’ కూడా అభిమానులనే కాదు, అందరినీ ఆకట్టుకొనేలా రూపొందింది. ఇలా విడుదలయిందో లేదో అలా వ్యూస్ పెంచుకుంటూ పోతోందీ పాట. ఇరవై నాలుగు గంటల్లో ‘భలే భలే బంజారా…’ ఏ స్థాయి రికార్డు అందుకుంటుందో చూడాలి.