నితిన్, కృతీశెట్టి, కేథరిన్ థ్రెసా హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. సీనియర్ ఫిల్మ్ ఎడిటర్ ఎమ్.ఎస్. రాజశేఖర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిఖితా రెడ్డి, సుధాకర్ రెడ్డి దీనిని నిర్మించారు. ఇందులో రాజకీయ నాయకుడు రాజప్పగా నటించారు ప్రముఖ నటుడు, దర్శకుడు సముతిర కని.
ఆయన తన పాత్ర గురించి చెబుతూ, ”గత ఏడాది దర్శకుడు రాజశేఖర్ ఈ కథ చెప్పారు. చాలా నచ్చింది. తమిళనాడులోని ఓ ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరిగింది. ఇరవై ఐదేళ్ళుగా అక్కడ ఎలక్షన్ జరగలేదు. చివరికి ఉదయ్ చందర్ అనే ఒక ఐఎఎస్ అధికారి చొరవ తీసుకొని అక్కడ స్థానికులతో మాట్లాడి పరిస్థితులని చక్కదిద్ది ఎన్నికలు జరిపారు. దర్శకుడు శేఖర్ తో కూడా అదే సంగతి చెప్పా. చాలా అద్భుతమైన కథ. తప్పకుండా చేస్తానని మాట ఇచ్చాను. ఈ పాత్రలో చాలా డెప్త్ వుంది. అలాంటి పాత్రలు నిజ జీవితంలో కూడా చూశాను. నేను చాలా పుస్తకాలు చదువుతాను. అలా చదివినప్పుడు ఏదో చోట రిఫరెన్స్ దొరుకుతుంది. రాజప్ప పాత్రలో సినిమా అంతా పవర్ ఫుల్ ఎమోషన్ క్యారీ చేస్తా. నటనకు ఆస్కారం వుండే అద్భుతమైన పాత్ర ఇది. నా పాత్రలో ఒక సర్ప్రైజ్ కూడా వుంది. అది థియేటర్లో చూడాల్సిందే. నితిన్ అద్భుతమైన వ్యక్తి. అతని పెర్ఫార్మెన్స్ ఎక్స్ ట్రార్డినరీ వుంటుంది. ఇందులో కొత్త నితిన్ ని చూస్తారు. అతని నుండి ఒక కొత్త విశ్వరూపం బయటికి వస్తుంది. మా ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా వుంటాయి. ఒక్కోసారి ఆయన కళ్ళల్లో చూసి కోపంగా డైలాగ్ చెప్పలేకపోయేవాడిని” అని అన్నారు.
తన తెలుగు సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ, ”టాలీవుడ్ లో నా ప్రయాణం అద్భుతంగా వుంది. తివిక్రమ్ గారు ఒక గిఫ్ట్ లా ‘అల వైకుంఠపురంలో’ ఇచ్చారు. ‘క్రాక్, ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, సర్కారు వారిపాట’ ఇలాంటి మంచి చిత్రాలు చేసే అవకాశం దొరికింది. త్రివిక్రమ్, రాజమౌళి, గోపిచంద్ మలినేని, పరశురాం లాంటి అద్భుతమైన దర్శకులతో కలసి పని చేసే అవకాశం దొరకడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, నాని ‘దసరా’ చిత్రాలలో నటిస్తున్నాను” అని చెప్పారు. తనలోని దర్శకుడి గురించి చెబుతూ, ”నాకు రచన అంటే ప్రాణం. షూటింగ్ గ్యాప్ లో సమయం దొరికితే కార్వాన్ లో కూర్చుని రాసుకుంటాను. రాసుకున్న కథలను బ్యాంకు లాకర్ లో పెట్టుకున్నట్లు దాచుకుంటా. నటుడిగా వున్నప్పుడు నా దృష్టి కేవలం నటనపైనే వుంటుంది. ఖాళీ సమయాల్లో దర్శకత్వం గురించి ఆలోచన చేస్తుంటాను. నితిన్ కూడా నా దర్శకత్వంలో నటిస్తానని చెప్పాడు. రెండేళ్ళ క్రితమే మాట్లాడుకున్నాం. సరైన సమయం వచ్చినపుడు మా సినిమా ఖచ్చితంగా జరుగుతుంది” అని చెప్పారు.