‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య, సంజన సారధి జంటగా డాక్టర్ సందీప్ చేగూరి దర్శకత్వంలో బి. చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘సరసాలు చాలు’. ఈ సినిమా పూజా కార్యక్రమాలు బుధవారం జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్ లో జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తనయుడు సాయికిరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. యూనిట్ సభ్యులకు సాయికిరణ్ స్క్రిప్ట్ అందించగా, శ్రీమతి శ్రుతిరెడ్డి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. చంద్రాకాంత్ రెడ్డి, రోహిత్ కెమెరా స్విచ్చాన్ చేశారు.
‘లూజర్’ వెబ్ సీరిస్ డైరెక్టర్ అభిలాష్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం దర్శకుడు డాక్టర్ సందీప్ చేగూరి మాట్లాడుతూ, ” ‘ఒక చిన్న విరామం’ సినిమా తర్వాత దర్శకత్వం వహిస్తున్న రెండో సినిమా ఇది. మూవీ పేరుకు తగ్గట్టుగానే రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా దీనిని తీయబోతున్నాను. అన్ని వర్గాలకు నచ్చే క్లీన్ ఎంటర్ టైన్ మెంట్ మూవీ ఇది. ప్రతి కపుల్ కి, రిలేషన్ షిప్ లో ఉన్న వాళ్ళకి, పెళ్లైన వాళ్ళ కి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ తో సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఎమోషన్స్, హార్ట్ బ్రేక్స్, నవ్వులు, కోపాలు ఉంటాయి. ఈ చిత్రంలో అద్భుతమైన నాలుగు పాటలు ఉంటాయి. మూడు షెడ్యూల్లో ఈ సినిమాను పూర్తి చేసి సమ్మర్ లో విడుదల చేస్తాం” అని అన్నారు.