తెలుగు చిత్రసీమలో ‘స్వర్ణోత్సవాలు,వజ్రోత్సవాలు’ అన్నవి ఏ నాటి నుంచో ఉన్నప్పటికీ వాటికి క్రేజ్ తీసుకు వచ్చిన ఘనత ఇద్దరికే దక్కుతుంది. వారిద్దరూ గురుశిష్యులు కావడం విశేషం! వారే దర్శకరత్న దాసరి నారాయణరావు, ఆయన శిష్యకోటిలో ‘గురువుకు తగ్గ శిష్యుడు’ అనిపించుకున్న కోడి రామకృష్ణ. దాసరి తన తొలి చిత్రం ‘తాత-మనవడు’తో ‘స్వర్ణోత్సవం’ చూశారు. శిష్యుడు కోడిరామకృష్ణ కూడా తన మొదటి సినిమా ‘ఇంట్లో రామయ్య-వీధిలో కృష్ణయ్య’తో ఏకంగా 510 రోజుల చిత్రాన్ని చూపించారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఇప్పటికీ అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రంగా ‘ఇంట్లో రామయ్య – వీధిలో క్రిష్ణయ్య’ నిలచే ఉంది.
నాటి మేటి నటులు నటరత్న యన్టీఆర్, నటసమ్రాట్ ఏయన్నార్ ఇద్దరితోనూ స్వర్ణోత్సవాలు తీసిన ఘనత ఒక్క దాసరి నారాయణరావుకే చెందుతుంది. ఏయన్నార్ తో దాసరి తెరకెక్కించిన ‘ప్రేమాభిషేకం’ చిత్రం 525 రోజులు ప్రదర్శితమై అప్పట్లో ఓ రికార్డ్ సృష్టించింది. ఏయన్నార్ కెరీర్ లో అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రంగా ‘ప్రేమాభిషేకం’ నిలచిపోయింది. ఇక యన్టీఆర్ తో దాసరి రూపొందించిన “సర్దార్ పాపారాయుడు (305 రోజులు), బొబ్బిలిపులి (365రోజులు)” ఉన్నాయి. అదే తీరున కోడి రామకృష్ణ చిరంజీవి, బాలకృష్ణ, సుమన్, అర్జున్ తో గోల్డెన్ జూబ్లీస్ చూశారు. బాలకృష్ణతో కోడి రామకృష్ణ తొలి చిత్రం ‘మంగమ్మగారి మనవడు’ 560 రోజులు మూడు ఆటలతో ప్రదర్శితమై ఈ నాటికీ హైదరాబాద్ లో అత్యధిక రోజులు ఆడిన తెలుగు చిత్రంగా నిలచింది. ఆ తరువాత బాలయ్యతో కోడి తెరకెక్కించిన “ముద్దులక్రిష్ణయ్య, ముద్దుల మావయ్య” చిత్రాలు సైతం గోల్డెన్ జూబ్లీ చూశాయి. అలాగే కోడి రామకృష్ణ సుమన్ తో ‘తరంగిణి’, అర్జున్ తో ‘మా పల్లెలో గోపాలుడు’ చిత్రాలతో స్వర్ణోత్సవం చూశారు.
గురువు దాసరి నారాయణరావు ‘ప్రేమాభిషేకం’తో 525 రోజుల చిత్రం చూస్తే, శిష్యుడు కోడి రామకృష్ణ ‘మంగమ్మగారి మనవడు’తో 560 రోజుల సినిమా తీశారు. అందువల్ల దాసరి శిష్యుల్లో ఎందరు ఉన్నా, గురువుకు తగ్గ శిష్యుడు కోడి రామకృష్ణ అనే చెప్పాలి. ఈ సినిమాల తరువాతే తెలుగునాట ‘గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ, ప్లాటినమ్ జూబ్లీ’ అన్న పదాలు విశేషంగా వినిపించాయి. వీటన్నిటినీ మించి తెలుగులో వెయ్యిరోజుల చిత్రంగా బాలయ్య ‘లెజెండ్’ నిలవడం విశేషం! ఏది ఏమైనా సినిమా రన్నింగ్ లోనూ రికార్డులు చూసిన దర్శకులు ఎందరో ఉన్నా, రన్నింగ్ లో రికార్డులు నెలకొల్పిన గురుశిష్యులుగా దాసరి, కోడి చిత్రసీమలో నిలచిపోయారు.