ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి! ఆయన ఆహ్లాదకర రచలే కాదు… భిన్నమైన నవలలూ రాశారు. నిజం చెప్పాలంటే మల్లాది టచ్ చేయని సబ్జెక్ట్ లేదు. ఆయన నవలలు అనేకం సినిమాలుగా వచ్చి మంచి విజయం సాధించాయి. మల్లాది రాసిన ‘9 అవర్స్’ అనే నవల ఆధారంగా క్రిష్ జాగర్లమూడి షో రన్నర్ గా అదే పేరుతో ఓ వెబ్ సీరిస్ తాజాగా రూపుదిద్దుకుంది. ఇది జూన్ 2 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. తారకరత్న, అజయ్, వినోద్ కుమార్, మధు షాలినీ, రవి వర్మ, ప్రీతి అస్రానీ తదితరులు ఈ వెబ్ సీరిస్ లో కీలక పాత్రలు పోషించారు. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ ను రాజీవ్ రెడ్డి వై, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు.
ఈ సందర్బంగా జరిగిన మీడియా మీట్ లో క్రిష్ మాట్లాడుతూ, ”మల్లాది గారి రచనలకు నేను అభిమానిని. మా నిర్మాణ సంస్థ నుంచి ఆయన నవలలు కొన్ని రైట్స్ తీసుకున్నాం. ఇంకొన్ని తీసుకోబోతున్నాం. మల్లాది రచన నుంచి వస్తున్న తొలి వెబ్ సిరీస్ ‘9 అవర్స్’. రియల్ టైమ్ క్రైమ్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటుంది. నా ‘గమ్యం’ సినిమాను కన్నడలో చేసిన జాకోబ్ వర్గీస్, యాడ్ ఫిల్మ్ మేకర్ నిరంజన్ ఈ వెబ్ సిరీస్ ను ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది” అని అన్నారు. తారకరత్న మాట్లాడుతూ, ”’9 అవర్స్’ వెబ్ సిరీస్ లో నాకు బాగా నచ్చిన అంశం ఇందులో ప్రతి క్యారెక్టర్ బాగుండటం. చాలా రోజుల తర్వాత సెట్ లో ఎంజాయ్ చేశాను. ఇద్దరు దర్శకులు ఒక్కొక్కరు ఒక్కో పార్ట్ డైరెక్షన్ చేస్తూ మంచి ఔట్ పుట్ ఇచ్చారు. బ్యాంక్ దొంగతనం అనేది దీంట్లో ఒక భాగం మాత్రమే. కథలో ఇంకా కొత్త విషయాలు ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ ను కుటుంబమంతా కలిసి చూడొచ్చు. క్రిష్ గారి ఆధ్వర్యంలో గుర్తుండిపోయే వెబ్ సిరీస్ చేయగలిగాం” అని అన్నారు. మధు షాలినీ మాట్లాడుతూ, ”ఈ వెబ్ సిరీస్ లో నేను చిత్ర అనే జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నాను. క్రైమ్ థ్రిల్లర్ గా ‘9 అవర్స్’ ఆకట్టుకుంటుంది. నేను ఈ కథలో క్రైమ్ సీన్ జరిగేప్పుడు అక్కడే ఉంటాను. వెబ్ సిరీస్ మొత్తం ఒక వింటేజ్ ఫీల్ తో సాగుతుంది. ఈ కథా నేపథ్యానికి తగినట్లు నటించేందుకు ప్రయత్నించాను. క్రిష్ గారి సినిమాలు ఎంతో బాగుంటాయి. ఆయనతో పనిచేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఈ వెబ్ సిరీస్ లో నటించడం సంతోషంగా ఉంది” అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రీతీ అస్రాని, బెనర్జీతో పాటు పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.