Chiranjeevi: ఓ హీరో నటించిన రెండు చిత్రాలు ఒకే రోజున విడుదల కావడం ఖచ్చితంగా విశేషమే! అలా రెండు పర్యాయాలు ఓ హీరోకు ఒకే యేడాది జరగడం నిజంగా మరింత విశేషం కదా! చిరంజీవి వర్ధమాన కథానాయకునిగా సాగుతున్న రోజులవి. 1982లో రెండు సార్లు ఆయన నటించిన రెండు చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యాయి. 1982 జూలై 30న చిరంజీవి హీరోగా రూపొందిన ‘సీతాదేవి’, ఆయన స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన ‘రాధా మై డార్లింగ్’ చిత్రాలు విడుదలయ్యాయి. ఆ తరువాత అక్టోబర్ 1న ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘టింగురంగడు’ జనం ముందు నిలిచాయి.
‘పట్నం వచ్చిన పతివ్రతలు’ చిత్రానికి కన్నడలో రూపొందిన ‘పట్టణక్కె బంద పత్నియరు’ ఆధారం. తెలుగులో ఈ సినిమాకు మౌళి దర్శకత్వం వహించారు. ఇందులో చిరంజీవి, మోహన్ బాబు నాయకులు కాగా, వారి సరసన రాధిక, గీత నటించారు. ఇందులో హీరోలిద్దరూ అన్నదమ్ములు. తమ బామ్మతో కలసి జీవిస్తుంటారు. వారిద్దరికీ పెళ్ళయ్యాక వారి భార్యలకు పట్నంలో నివసించాలన్న కోరిక కలుగుతుంది. భర్తలకు తెలియకుండా పట్నవాసం చేయాలని ఇద్దరమ్మాయిలు వెళతారు. అక్కడ పలు పాట్లు పడతారు. వారిని వెదకుతూ పోయిన భర్తలకు వారిని గంగాదేవి అనే ఆమె నిర్బంధించిందని తెలుసుకుంటారు. ఆమె బారి నుండి తమ భార్యలను రక్షించుకోవడమే కాకుండా, గంగాదేవిని పోలీసులు అరెస్ట్ చేసేలా చేస్తారు అన్నదమ్ములు. అదీ ఈ సినిమా కథ!
ఇక చిరంజీవి సోలో హీరోగా రూపొందిన ‘టింగు రంగడు’లో ఆయన జోడీగా గీత నటించారు. అంటే ‘పట్నం వచ్చిన పతివ్రతలు’లో చిరుకు వదినగా నటించిన గీతతోనే ఇందులో ఆయన రొమాన్స్ చేయవలసి వచ్చిందన్న మాట! ఇందులో రంగడు తన మామ్మతో కలసి జీవిస్తుంటాడు. రంగడు ఇంట్లోంచి పారిపోయి, పట్నంలో రామచంద్రరావు, జానకి దంపతుల దగ్గరకు వెళతాడు. తాను రామచంద్రరావు అక్రమ సంతానాన్ని అని చెబుతాడు. రామచంద్రరావు అంగీకరించడు. కానీ, జానకి రంగడిని ఇంట్లో ఉండనిస్తుంది. అయితే జానకి సోదరుడి వరస అయిన భూషణం పిల్లలు లేని రామచంద్రరావు దంపతులు తన కొడుకును దత్తత తీసుకోవాలని ఆశిస్తూ ఉంటాడు. దాంతో భూషణం, రంగడిని ఎలాగైనా ఇంటి నుండి గెంటేయించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రతీసారి అతని ఎత్తుకు పైఎత్తు వేస్తూ సాగుతుంటాడు రంగడు. రామచంద్రరావు అన్న కొడుకే రంగడు అన్న నిజాన్ని రంగడి మామ్మ వచ్చి చెబుతుంది. ఎలాగైనా ఆస్తి కోసం అందరినీ నాశనం చేయాలని చూసిన భూషణానికి తగిన శాస్తి చేస్తాడు రంగడు. దాంతో కథ సుఖాంతమవుతుంది. ‘టింగురంగడు’కు టి.ఎల్.వి.ప్రసాద్ దర్శకుడు.
ఈ రెండు చిత్రాలలో ‘టింగురంగడు’ మాస్ జనాన్ని ఆకట్టుకోగా, ‘పట్నం వచ్చిన పతివ్రతలు’లోని వినోదం అందరినీ అలరించింది. ‘పట్నం వచ్చిన పతివ్రతలు’కు సత్యం సంగీతం సమకూర్చగా, ‘టింగురంగడు’ చక్రవర్తి బాణీలతో రూపొందింది.