40 Years Celebrations for Oorantha Sankranthi Movie: తన సీనియర్ స్టార్స్ తోనూ, తరువాతి తరం స్టార్ హీరోలతోనూ నటించి, తెలుగునాట ఎక్కువ మల్టీస్టారర్స్ లో నటించిన హీరోగా పేరు సంపాదించారు నటశేఖర కృష్ణ. తన సీనియర్స్ నటరత్న యన్టీఆర్, నటసమ్రాట్ ఏయన్నార్ ఇద్దరితోనూ ఆయన పలు చిత్రాలలో కలసి నటించారు. అయితే 40 ఏళ్ళ క్రితం ఈ ఇద్దరు హీరోలతోనూ కృష్ణ నటించడం అప్పట్లో ఓ విశేషం అనే చెప్పాలి. ఎందుకంటే, యన్టీఆర్ రాజకీయాలకు వెళ్ళే వరకు చిత్రసీమలో ఆయనే మకుటం లేని మహారాజు. అందుకు నిదర్శనంగా ‘జ్యోతిచిత్ర’ సినిమా వారపత్రిక నిర్వహించిన ‘సూపర్ స్టార్’ పోటీలోనూ యన్టీఆర్ నంబర్ వన్ గా నిలిచారు.
Read Also:Mars: అంగారకుడిపై నీటి ఆనవాళ్లు.. క్యూరియాసిటీ రోవర్ అద్భుత ఆవిష్కరణ..
ఆయన ఫీల్డ్ లో ఉన్నంత వరకు ఏయన్నార్ నంబర్ టూగా ఉండేవారు. ఆ తరువాత మాస్ హీరోగా సాగుతున్న కృష్ణ ‘సూపర్ స్టార్’ అనిపించుకున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణ ఇతర హీరోలతో నటించిన చిత్రాలు జనానికి ఆసక్తి కలిగించేవి. అలా ఆసక్తి కలిగించిన చిత్రంగా ‘ఊరంతా సంక్రాంతి’ని చెప్పుకోవాలి. ఏయన్నార్, కృష్ణ హీరోలుగా దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1983 ఫిబ్రవరి 12న విడుదలయింది. ఈ సినిమా కంటే ఆరు నెలలు ముందు యన్టీఆర్ తో కృష్ణ నటించిన ‘వయ్యారి భామలు- వగలమారి భర్తలు’ జనం ముందు నిలచింది. అది వసూళ్ళు బాగా రాబట్టింది. దాంతో యన్టీఆర్ తో కృష్ణ నటించిన సినిమా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయా? ఏయన్నార్ తో కృష్ణ కలసి చేసిన చిత్రం ఎక్కువ వసూళ్ళు చూస్తుందా? అన్నదానిపై అభిమానుల్లో చర్చ సాగింది. అలా ‘ఊరంతా సంక్రాంతి’ మొదలైన దగ్గర నుంచీ జనాల్లో ఓ ఆసక్తి నెలకొల్పింది. పైగా ఏయన్నార్, దాసరి నారాయణరావు కాంబినేషన్ లో వచ్చిన ‘ప్రేమాభిషేకం’ అనూహ్య విజయం సాధించడంతోనూ ఈ మల్టీస్టారర్ పై కాస్త ఆసక్తి పెరిగేలా చేసింది.
Read Also: Object Flying Shot Down: 40 వేల అడుగుల ఎత్తులో వస్తువు.. కూల్చేసిన యూఎస్ ఫైటర్ జెట్
మల్టీస్టారర్స్ అనగానే అంతకు ముందు పాపులర్ స్టోరీస్ తోనే మళ్ళీ పేరున్న స్టార్స్ తో సినిమాలు తీసేవారు. ‘వయ్యారి భామలు- వగలమారి భర్తలు’లోనూ, ‘ఊరంతా సంక్రాంతి’లోనూ కథ చూస్తే పాత చింతకాయ పచ్చడే అనిపిస్తుంది. అందులోనూ ఇద్దరు అన్నదమ్ములు ఎంతో అన్యోన్యంగా ఉండడం, వారి మధ్య స్వార్థపరులు విభేదాలు సృష్టించడం, తరువాత నిజాలు తెలిసి, వారిని ఉతికేయడం కథ. అదే తీరున ‘ఊరంతా సంక్రాంతి’ కూడా ఇద్దరు అన్నదమ్ముల కథ. ప్రెసిడెంట్ రాఘవయ్య పెద్ద భార్య కొడుకు వేణు, చిన్నభార్య కొడుకు గోపి. రాఘవయ్య రెండో భార్య భానుమతి. ఆమె అన్న కోటయ్య. అతనికి సత్య అనే కూతురు ఉంటుంది.
ఆమె గోపి ప్రేమించుకుంటారు. వేణు, అదే ఊరిలోని పేదింటి అమ్మాయి దుర్గను ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఈ పెళ్ళికి రాఘవయ్య అంగీకరించడు. కానీ, అన్న పక్షాన నిలచి గోపి వారి పెళ్ళి జరిపిస్తాడు. కుట్రలు పన్ని, రాఘవయ్యనే ప్రెసిడెంట్ పదవి నుండి తప్పించి తాను ప్రెసిడెంట్ అవుతాడు కోటయ్య. అలాగే అన్నదమ్ముల మధ్య చిచ్చుపెడతాడు. చివరకు వేణు జైలుకు వెళ్ళేలా చేస్తాడు. గోపిని నమ్మించి మోసం చేసిన కోటయ్య, తన కూతురును వేరే వాడికి ఇచ్చి పెళ్ళి చేయాలని చూస్తాడు. ఈ విషయం తెలిసిన వేణు జైలు నుండి తప్పించుకు వస్తాడు. పెళ్ళిని అడ్డగిస్తాడు. గోపి కూడా వచ్చి కోటయ్య మనుషులను చితగ్గొడతాడు. తన తమ్ముడి చేత సత్య మెడలో తాళి కట్టిస్తాడు వేణు. అసలు నేరస్థులను జైలుకు పంపించడంతో కథ ముగుస్తుంది.
ఇందులో ఏయన్నార్ జోడీగా జయసుధ, కృష్ణ జంటగా శ్రీదేవి నటించారు. రావు గోపాలరావు, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, నగేశ్, రమాప్రభ, మమత, రాజసులోచన, నిర్మలమ్మ, డబ్బింగ్ జానకి, సాక్షి రంగారావు, సూర్యకాంతం ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం దాసరి నారాయణరావు నిర్వహించారు. అంతకు ముందు ఏయన్నార్ హీరోగా దాసరి దర్శకత్వంలో ‘రాగదీపం’ నిర్మించిన కొడాలి బోసుబాబు ఈచిత్రానికి సమర్పకుడు కాగా, ప్రముఖ ఎడిటర్ కోటగిరి గోపాలరావు నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి గానగంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సంగీతం సమకూర్చడం విశేషం! ఇందులోని “సంబరాల సంక్రాంతి…”, “ఊరంతా గోల గోల…”, “తూర్పు దీపం…”, “ఓ భామా నీ నోము…”, “ఝుమ్ ఝుమ్ అంటూ వస్తోంది…” అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. కాకపోతే, అక్కినేని, ఘట్టమనేని అభిమానులను అలరించింది.
Read Also: Suresh Babu: సురేష్ బాబు, రానా మీద క్రిమినల్ కేసు నమోదు…