బాలీవుడ్ లో మల్టీస్టారర్ మూవీస్ కు కొదవలేదు. ఇద్దరు ముగ్గురు సూపర్ స్టార్స్ కూడా ఎలాంటి ఇగోలేకుండా హ్యాపీగా సినిమాల్లో నటిస్తుంటారు. చేస్తోంది హీరో పాత్ర, విలన్ పాత్ర అనేది కూడా చూసుకోరు. అంతేకాదు… స్టోరీ నచ్చాలే కానీ నిడివికి కూడా ప్రాధాన్యం ఇవ్వరు. ప్రస్తుతం బాలీవుడ్ లో పలు టూ హీరో మూవీస్ తెరకెక్కుతున్నాయి. అయితే అందులో నాలుగు సినిమాలు మాత్రం ట్రెండింగ్ అవుతున్నాయి.
అందులో మొదటిది ‘పఠాన్’. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, జాన్ అబ్రహం ఇందులో నటిస్తున్నారు. దీపికా పదుకొనే కథానాయిక. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ మూవీని వచ్చే యేడాది జనవరి 25న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాతో నాలుగేళ్ల తర్వాత షారుఖ్ తిరిగి వెండితెరపైకి వస్తున్నాడు. ఇక ఆ కోవలోనే రెండో సినిమా ‘టైగర్ -3’. సల్మాన్ ఖాన్ ‘టైగర్’ సీరిస్ లో ఇది మూడో సినిమా. గతంలో ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ చిత్రాలు చేశాడు సల్మాన్. అందులో పోషించిన రా ఏజెంట్ అభినాష్ సింగ్ రాథోడ్ పాత్రనే ఇందులోనూ చేస్తున్నాడు. ఇందులో విలన్ గా ఇమ్రాన్ హష్మీ చేస్తున్నాడు. ఇక ఐఎస్ఎ ఏజెంట్ పాత్రను ఎప్పటిలానే కత్రినా కైఫ్ పోషిస్తోంది. విశేషం ఏమంటే ‘టైగర్’ మొదటి చిత్రాన్ని 75 కోట్లతో తీసిన యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ, రెండో సినిమాను 150 కోట్లతో నిర్మించింది. ఇప్పుడీ మూడో సినిమాను ఏకంగా 350 కోట్ల బడ్జెట్ తో తీయబోతోందని తెలుస్తోంది.
ట్రెండింగ్ లో ఉన్న ఇద్దరు హీరో సినిమాలలో మూడోది తమిళ రీమేక్ అయిన ‘విక్రమ్ వేద’. బాలీవుడ్ లో ఈ సినిమాను హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నారు. తమిళ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన భార్యాభర్తలు గాయత్రి, పుష్కర్ హిందీ రీమేక్ ను తీస్తున్నారు. ఇక నాలుగో సినిమా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటిస్తున్న ‘బడే మియా చోటే మియా’. గతంలో ఇదే పేరుతో అమితాబ్, గోవింద ఓ కామెడీ సినిమా చేశారు. ఇప్పుడు అదే పేరుతో ఫ్రెష్ స్టోరీ తీసుకున్ని అక్షయ్ – టైగర్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ చేయబోతున్నారు. మొత్తం మీద బాలీవుడ్లో ఇద్దరు హీరోలు నటిస్తున్న సినిమాలు ఇంకా అనేకం ఉన్నా… ఈ నాలుగు సినిమాలు ట్విట్టర్ లో ట్రెండింగ్ అవుతుండటం విశేషం.