(ఏప్రిల్ 9తో ‘కలెక్టర్ గారి అబ్బాయి’కి 35 ఏళ్ళు)
మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు, ఆయన నటవారసుడు నాగార్జున కలసి నటించిన చిత్రాలలో తొలి సూపర్ హిట్ గా నిలచిన చిత్రం ‘కలెక్టర్ గారి అబ్బాయి’. బి.గోపాల్ దర్శకత్వంలో ఏయన్నార్ పెద్ద అల్లుడు యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ‘కలెక్టర్ గారి అబ్బాయి’ 1987 ఏప్రిల్ 9న విడుదలయి, విజయఢంకా మోగించింది.
‘కలెక్టర్ గారి అబ్బాయి’ కథ ఏమిటంటే – రమాకాంతరావు అనే కలెక్టర్ నీతి, నిజాయితీలే ప్రాణంగా జీవిస్తూ ఉంటారు. ఆయన భార్య లక్ష్మీదేవి, తనయుడు రవి, కూతురు జ్యోతితో ఆనందంగా సాగుతుంటారు. అదే ఊరిలో అప్పారావు, ఏలిముద్రల యెల్లయ్య వారి పుత్రులు కన్నారావు, చిన్నారావు తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. వారు చేసే పనులను కలెక్టర్ అడ్డుకుంటారు. దాంతో రమాకాంతరావుపై పగ పెంచుకుంటారు అప్పారావు, యెల్లయ్య. ఎన్నికల్లో పోటీ చేసిన యెల్లయ్య గెలుపొందడమే కాదు, మంత్రి కూడా అవుతాడు. రమాకాంతరావు కుటుంబంపై పగ తీర్చుకొనే ప్రయత్నం చేస్తుంటారు. రవి, తన మిత్రుడు సత్యం చెల్లెలు భారతిని ప్రేమిస్తాడు. సత్యం జర్నలిస్టు, కాగా ఆయన తండ్రి శ్రీనివాసరావు ఓ పత్రికకు ఎడిటర్. యెల్లయ్య, అప్పారావు చేసిన దారుణాలకు సాక్ష్యాలు సంపాదిస్తాడు సత్యం. అతణ్ణి కన్నారావు, చిన్నారావు చంపేస్తారు. రవి వారిని చట్టానికి పట్టిస్తాడు. అయితే దొంగ సాక్ష్యాలతో వారు బయట పడతారు. వారిని ఎలాగైనా చంపాలని చూస్తాడు రవి. అందుకు రమాకాంతరావు అడ్డు పడతారు. దాంతో రవి ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. తరువాత పోలీసాఫీసర్ గా తిరిగి వస్తాడు. అప్పుడు కూడా తండ్రి, కొడుకు వేర్వేరు దారుల్లోనే దోషులను పట్టుకోవాలని భావిస్తారు. కలెక్టర్ రహస్యంగా అప్పారావు, యెల్లయ్య చేసే దొంగవ్యాపారాలు, మోసాల గురించి సాక్ష్యాలు సేకరిస్తారు. వాటిని చట్టం ముందు చూపించి, యెల్లయ్య మంత్రి పదవి పోయేలా చేస్తారు. ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న ప్రత్యర్థులు రవిని ఎటాక్ చేస్తారు. ఆ దాడిలో రవి చెల్లెలు జ్యోతి ప్రాణాలు కోల్పోతుంది. తండ్రి, కొడుకు ఒక్కటై దుర్మార్గుల భరతం పడతారు. చివరకు రవి ఆ దుర్మార్గులను చంపబోతే, కలెక్టర్ వచ్చి అడ్డుకుని వారిని చట్టానికి అప్పచెబుతారు. తనయుడు రవిని రమాకాంతరావు అభినందించడంతో కథ ముగుస్తుంది.
ఏయన్నార్, నాగార్జున, శారద, రజని, నూతన్ ప్రసాద్, కోట శ్రీనివాసరావు, సుధాకర్, శుభలేఖ సుధాకర్, సూర్య, సుత్తివేలు, పి.ఎల్. నారాయణ, నర్రా వెంకటేశ్వరరావు, శ్రీలక్ష్మి ముఖ్యతారాగణం. ఈ చిత్రానికి కొమ్మనాపల్లి గణపతిరావు, ఆంజనేయ పుష్పానంద్, రామమోహనరావు కథను సమకూర్చారు. స్క్రీన్ ప్లే ఆంజనేయ పుష్పానంద్ రాయగా, గణేశ్ పాత్రో మాటలు పలికించారు. చక్రవర్తి స్వరకల్పన చేసిన ఈ చిత్రంలోని అన్ని పాటలనూ వేటూరి సుందరరామ్మూర్తి రాశారు. ఈ సినిమా అప్పట్లో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని హిందీలో ‘కానూన్ అప్నా అప్నా’ పేరుతో రీమేక్ చేయగా, ఆ సినిమాకూ బి.గోపాల్ దర్శకత్వం వహించారు. అందులో దిలీప్ కుమార్, సంజయ్ దత్ నటించారు.
‘కలెక్టర్ గారి అబ్బాయి’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రామ్ గోపాల్ వర్మ తరువాత తన ‘శివ’ కథతో నిర్మాత యార్లగడ్డ సురేంద్రను మెప్పించారు. అన్నపూర్ణ సినీస్టూడియోస్ భాగస్వామ్యంతో ‘శివ’ను సురేంద్ర నిర్మించారు. ఈ సినిమాతోనే రామ్ గోపాల్ వర్మ దర్శకునిగా పరిచయమై, సంచలన విజయం సాధించారు.