Varasudu: అరె… ఇదేంటి ఈ సంక్రాంతికేగా విజయ్ ‘వారసుడు’ రిలీజ్ అయింది. అప్పుడే ముప్పై ఏళ్ళా? అని ఈ తరం వారు భావించే అవకాశం ఉంది. కానీ, 30 ఏళ్ళ క్రితం నాగార్జున హీరోగా ఓ ‘వారసుడు’జనాన్ని అలరించింది. అందులో నాగార్జున తండ్రిగా నటశేఖర కృష్ణ నటించడం అప్పట్లో విశేషంగా ముచ్చటించుకున్నారు. ఈ సినిమాను మరో ప్రముఖ నటుడు మురళీమోహన్ తమ శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన ‘వారసుడు’ 1993 మే 5న విడుదలై విజయం సాధించింది. ఈ చిత్రానికి అజయ్ దేవగన్ హీరోగా రూపొందిన ‘ఫూల్ ఔర్ కాంటే’ ఆధారం.
ఈ ‘వారసుడు’ కథ విషయానికి వస్తే- వినయ్ తాను చదివే కాలేజ్ లో చేరిన కీర్తిని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. అదే కాలేజ్ లో చదివే వంశీ పిచ్చివేషాలు వేస్తే బడితె పూజ చేస్తాడు వినయ్. దాంతో రౌడీలను తెచ్చి, వినయ్ ను అంతం చేయాలనుకుంటాడు వంశీ. ఈ నేపథ్యంలో ధర్మతేజ అనే డాన్ వచ్చి వినయ్ ని రక్షిస్తాడు. అయితే వినయ్ అతడిని చూసి అసహ్యించుకుంటాడు. ఎందుకంటే అతను వినయ్ కి తండ్రి. ధర్మతేజ ఓ స్మగ్లర్ అని, తన తల్లి చావుకు అతనే కారణమని వినయ్ అతడంటే అగ్గిమీద గుగ్గిలం అవుతూ ఉంటాడు. వినయ్ పై మళ్ళీ ఎటాక్ చేయాలని చూసిన వంశీని ధర్మతేజ చంపేస్తాడు. వినయ్, కీర్తి పెళ్ళిచేసుకొని హాయిగా కాపురం చేస్తుంటారు. వారికి ఓ బాబు పుడతాడు. ముద్దులొలికే ఆ బాబును ఎవరో ఎత్తుకుపోతారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోతే, పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడంతో వారిపై చేయి చేసుకుంటాడు వినయ్. తరువాత తన కొడుకు ఎక్కడ ఉన్నాడో వెదుకుతూ ఉన్న వినయ్ కి తండ్రి ధర్మతేజపై అనుమానం కలుగుతుంది. ధర్మతేజ తన కోడలును కూడా మాటలతో ఆకట్టుకుంటాడు. కానీ, ధర్మతేజ శత్రువులు వినయ్ పై ఎటాక్ చేస్తారు. తన కొడుకును ధర్మతేజనే కిడ్నాప్ చేశాడని తెలుసుకుంటాడు వినయ్. ఎందుకు తన సొంతమనవడినే కిడ్నాప్ చేయవలసి వచ్చిందో వివరిస్తాడు. అలాగే తన గతాన్ని కొడుకు అర్థం చేసుకొనేలా చెబుతాడు ధర్మతేజ. తండ్రీకొడుకులు కలుసుకొనే సమయానికి వంశీ తండ్రి అతని మనుషులు వచ్చి, వినయ్ కొడుకును ఎత్తుకుంటారు. వారితో వినయ్, ధర్మతేజ పోరాడతారు. తన ప్రాణాలు అడ్డుపెట్టి మనవడిని రక్షించుకుంటాడు ధర్మతేజ. చనిపోతూ కోడలుతో “నీ వారసుణ్ణి, నా వారసుణ్ణి కూడా నీకే అప్పగిస్తున్నానమ్మా” అంటూ ధర్మతేజ కన్నుమూయడంతో కథ ముగుస్తుంది.
ఈ చిత్రంలో నగ్మా నాయికగా నటించగా, గుమ్మడి, దేవరాజ్, శరత్ సక్సేనా, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, బాబూమోహన్, శ్రీకాంత్, బాలయ్య, గీత, హేమ, కోట శంకరరావు, నర్సింగ్ యాదవ్, మాస్టర్ బాలాదిత్య ఇతర ముఖ్యపాత్రధారులు. ప్రస్తుతం ప్రముఖ నటులుగా రాణిస్తున్న పృథ్వీ, గౌతమ్ రాజ్, తిరుపతి ప్రకాశ్ వంటివారు కూడా ఇందులో కనిపిస్తారు. ఈ చిత్రానికి కీరవాణి స్వరకల్పన చేయగా, వేటూరి, వెన్నెలకంటి, భువనచంద్ర పాటలు పలికించారు. ఇందులోని “పాప హలో హలో…”, “ధిమ్ తనక ధిమ్…”, “సిలక లాగా…”, “చమ్ చమ్ చమ్…”, “ప్రమాదం యమ ప్రమాదం…” అంటూ సాగే పాటలు అలరించాయి.
హిందీలో విజయం సాధించిన ‘ఫూల్ ఔర్ కాంటే’ ఆధారంగా తెరకెక్కినా, తెలుగుకు అనువుగా కొన్ని మార్పులూ చేర్పులూ చేశారు. ముఖ్యంగా ఇ.వి.వి. తనదైన రీతిలో కామెడీని చొప్పించారు. ఈ సినిమాలో కృష్ణ, నాగార్జున డైలాగ్ వార్ ను చూసి అభిమానులు గొడవ చేశారు. తరువాత కృష్ణ, నాగ్ కేవలం అక్కడ పాత్రలనే చూడాలని ప్రకటించాల్సి వచ్చింది. ఈ చిత్రం మంచి విజయం సాధించి, అనేక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది.