(సెప్టెంబర్ 19న ‘శాంతి-క్రాంతి’కి 30 ఏళ్ళు)
ప్రస్తుతం ఒకే కథను పలు భాషల్లో తెరకెక్కించి, సొమ్ము చేసుకోవాలని మన స్టార్ హీరోస్ తో చిత్రాలు నిర్మించేవారు ఆశిస్తున్నారు. ఆ పంథా కొత్తదేమీ కాదు. తెలుగు సినిమా స్వర్ణయుగం చవిచూసిన రోజుల నుంచీ ఉంది. అయితే ఇప్పుడు ఆ విధానం మునుపటికంటే మాంచి ఊపు మీద ఉంది. కన్నడ నటదర్శకుడు వి.రవిచంద్రన్ 30 ఏళ్ళ క్రితమే ఈ పద్ధతిలో ‘శాంతి-క్రాంతి’ అనే చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందించారు. తెలుగులో నాగార్జున, తమిళ, హిందీ భాషల్లో రజనీకాంత్, కన్నడలో రవిచంద్రన్ ప్రధాన పాత్రను పోషించారు. కన్నడలో సైడ్ రోల్ ను రమేశ్ అరవిందన్ ధరించగా, మిగిలిని మూడు భాషల్లోనూ ఆ పాత్రలో రవిచంద్రన్ కనిపించారు. తమిళంలో ఈ చిత్రం పేరు ‘నాట్టుక్కు ఒరు నల్లవాన్’. చిత్రమేమిటంటే రజనీకాంత్ నటించిన తమిళ వర్షన్ తరువాత ‘పోలీస్ బుల్లెట్’ పేరుతో తెలుగులోకి అనువాదమయింది. 1991 సెప్టెంబర్ 19న తెలుగు, కన్నడ వర్షన్స్ విడుదలయ్యాయి. అదే యేడాది అక్టోబర్ 2న తమిళ వర్షన్ జనం ముందు నిలచింది.
పైకి పెద్దమనిషిలా కనిపిస్తూ మనుషుల అవయవాలను దొంగిలించి విదేశాలకు ఎగుమతి చేస్తుంటాడు డాడీ అనే వ్యక్తి. అతని ఆట కట్టించడానికి ఇన్ స్పెక్టర్ సుభాష్, అతని మిత్రుడు ఇన్ స్పెక్టర్ భరత్ పూనుకుంటారు. ఈ ఇద్దరు ఇన్ స్పెక్టర్స్ కు దేశభక్తి మెండుగా ఉంటుంది. దేశం కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉంటారు. డాడీ చేసే అకృత్యాలను వీరు ఎదుర్కొంటారు. చివరకు అతని అరాచక సామ్రాజ్యాన్ని నేలమట్టం చేస్తారు. రవిచంద్రన్ కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వంలో నాలుగు భాషల్లోనూ ఈ కథ తెరకెక్కింది. తమ ఈశ్వరీ ప్రొడక్షన్స్ పతాకంపై రవిచంద్రన్ ఈ సినిమాను నిర్మించారు.
ఈ చిత్రంలో జూహీ చావ్లా, ఖుష్బూ నాయికలు. అనంతనాగ్, సత్యనారాయణ, బాబు ఆంటోనీ, మానిక్ ఇరానీ, చారుహాసన్, శ్రీనాథ్, పి.జె.శర్మ, ఆహుతి ప్రసాద్, సాక్షి రంగారావు, అన్నపూర్ణ, బేబీ సంగీత నటించారు. ఈ చిత్రానికి హంసలేఖ సంగీతం ఎస్సెట్. ఇందులో మొత్తం తొమ్మిది పాటలున్నాయి. వేటూరి కలం పలికించిన “స్వతంత్ర భారతమా…”, “అర్ధరాత్రిలో…”, “ఎవరు నీ సరి…” వంటి పాటలు ఆకట్టుకున్నాయి. ఇందులో ఎనిమిది పాటలను వేటూరి పలికించగా, “వచ్చాడు యమరాజా…” గీతాన్ని సిరివెన్నెల రాశారు. ‘శాంతి క్రాంతి’పై బోలెడు ఆశలతో రవిచంద్రన్ తెరకెక్కించారు. అంతకు ముందు రవిచంద్రన్, జూహీ చావ్లా నటించిన కన్నడ చిత్రం ‘ప్రేమలోక’ ఘనవిజయం సాధించింది. ఈ సినిమా తెలుగులో ‘ప్రేమలోకం’ పేరుతో అనువాదమై ఇక్కడా అలరించింది. అందువల్లే రవిచంద్రన్ తన ‘శాంతి-క్రాంతి’ కథను నాలుగు భాషల్లో రూపొందించారు. ఏ భాషలోనూ ఈ కథ జనాన్ని ఆకట్టుకోలేకపోయింది.