రచయితలుగా పరుచూరి బ్రదర్స్ తెలుగునాట చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇక వారు దర్శకులుగా మారి ఓ తొమ్మిది చిత్రాలు రూపొందించారు. ‘కాయ్ రాజా కాయ్’ అంటూ మెగా ఫోన్ పట్టిన ఈ బ్రదర్స్, సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన ‘శ్రీకట్న లీలలు’కు కూడా దర్శకత్వం వహించారు. ఆ తరువాత మరో ఆరేళ్ళకు అదే సంస్థలో శోభన్ బాబు ప్రధాన పాత్రలో ‘సర్పయాగం’ రూపొందించారు. ఇందులో శోభన్ కు రోజా కూతురుగా నటించడం విశేషం. 1991 నవంబర్ 1న ‘సర్పయాగం’ జనం ముందు నిలచింది.
‘సర్పయాగం’ కథ విషయానికి వస్తే – భారతంలో తన తండ్రి పరిక్షిత్ ను చంపిన తక్షకునిపై ప్రతీకారంతో జనమేజయుడు సర్పయాగం చేస్తాడు. ఈ సినిమాలో తన కూతురును అన్యాయంగా బలిగొన్న మదమెక్కిన రాక్షసులను ఓ తండ్రి ఎలా అంతం చేశాడు అన్నదే కథ. డాక్టర్ వేణుగోపాల్ ఎంతోమంది ప్రాణాలు రక్షించిన దేవునిగా పేరు సంపాదించి ఉంటాడు.
తల్లిలేని తన కూతురు అనసూయను ఎంతో గారాబంగా పెంచుకుంటాడు. ఆమె చదువుకొనే కాలేజీలో ఫణి అనేవాడు, ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరవుతాడు. ఆమెను అనుభవించాలని ఓ పథకం వేసి, మిత్రులతో కలసి సామూహిక అత్యాచారం చేస్తాడు. జరిగిన విషయాన్ని ఓ లేఖ ద్వారా తండ్రికి తెలిపి, ఆత్మహత్య చేసుకుంటుంది అనసూయ. కామంతో పడగవిప్పిన పాముల కోరలు తీసి, అంతం చేయడానికి పూనుకుంటాడు డాక్టర్ వేణుగోపాల్. ఆయనకు కొందరు రౌడీలు కూడా సహకరిస్తారు. చివరకు అనుకున్నది సాధించి, చట్టానికి లొంగుతాడు డాక్టర్.
వాణీవిశ్వనాథ్, సాయికుమార్, బ్రహ్మానందం, రఘునాథ రెడ్డి, శ్రీనివాస వర్మ, జయలలిత, నగేశ్, నూతన్ ప్రసాద్, సుత్తివేలు, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర తదితరులు ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రానికి తమదైన సంభాషణలు రాసి ఆకట్టుకున్నారు పరుచూరి బ్రదర్స్. వారి దర్శకత్వంలో రూపొందిన చిత్రాలలో ‘సర్పయాగం’ మంచి ఆదరణ పొందింది.
డి.రామానాయుడు నిర్మించిన ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతం సమకూర్చారు. పాటలన్నీ సి.నారాయణ రెడ్డి రాశారు. ఇందులోని “దిగు దిగు నాగ… నెత్తిమీద డేగ…” పాట భలేగా ఆకట్టుకుంది. “ఏబీసీడీ గుండెల్లో ఏదో వేడి…”, “చుబ్రం చేయ్ నా… చుబ్రం చేయ్ నా…”, “చుక్కా చుక్కా…”, “కుంకుమ పూబోణి…” పాటలు అలరించాయి. ఈ సినిమా జనాదరణ చూరగొంది.