బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునయన – షణ్ముఖ్ బ్రేకప్ తో అందరి దృష్టి గత యేడాది విడిపోయిన జంటలపై పడింది. దీప్తి సునయన తన బ్రేకప్ వార్తను అధికారికంగా జనవరి 1న ప్రకటించిన తర్వాత వారిద్దరి తప్పొప్పులపై బాగానే చర్చ జరిగింది. బిగ్ బాస్ షోకు ఇప్పటికే వెళ్ళి వచ్చిన దీప్తి సునయనకు అక్కడ ఎవరు ఎలా ప్రవర్తిస్తారో తెలియదా? అని కొందరు ప్రశ్నిస్తుంటే, దీప్తిని ప్రేమించిన షణ్ముఖ్ కేవలం విజేతగా మారేందుకే సిరితో లవ్వాట ఆడాడని, ఆమెతో అంత సన్నిహితంగా ఉండాల్సిన అవసరం ఏమిటనీ మరికొందరు అడుగుతున్నారు.
వీరి గొడవ ఇలా ఉండగా… గడిచిన యేడాది ఎలిజిబుల్ బ్యాచిలర్స్ – బ్యూటీ క్వీన్స్ పెళ్ళి పీటలు ఎక్కడం, గ్రాండ్ వెడ్డింగ్ జరుపుకోవడం ఎంతో మందికి ఆనందాన్ని కలిగించింది. ఇదే సమయంలో స్టార్ కపుల్ కొందరు విడాకులు తీసుకోవడం, ఎంగేజ్ మెంట్ ను కాన్సిల్ చేసుకోవడం వారి అభిమానులను తీవ్రంగా కలిచివేసింది. అలా తెలుగువారిలో ఎవరూ ఊహించని సంఘటన అక్కినేని నాగచైతన్య – సమంత విషయంలో జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో 2017లో గోవాలో డెస్టినేషన్ ను చేసుకున్న చైతు – సమంత పరస్పర అవగాహనతో విడిపోయారు. ఫిబ్రవరి నుండే వీరి బ్రేకప్ కు సంబంధించిన రూమర్స్ నెట్టింట వైరల్ అవుతున్నా, సమంత వాటిని ఇన్ డైరెక్ట్ గా ఖండిస్తూ వచ్చింది. మొత్తానికి వీరు తమ ఎడబాటు వార్తను అక్టోబర్ 2న అధికారికంగా ప్రకటించి, ఈ రూమర్స్ లో నిజం ఉందని తేల్చేశారు.
అలానే దేశవ్యాప్తంగా అందరినీ షాకింగ్ కు గురిచేసిన మరో విడాకుల వార్త ఆమిర్ ఖాన్ కు సంబంధించింది. 1986లో రీనా దత్ ను వివాహమాడి 2002లో విడాకులు ఇచ్చిన ఆమీర్ 2005లో కిరణ్ రావ్ ను వివాహం చేసుకున్నాడు. అయితే 16 సంవత్సరాల వివాహబంధానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్టు 2021 వీరిద్దరూ ప్రకటించారు. వీరికి ఆజాద్ అనే కొడుకున్నాడు. చిత్రం ఏమంటే భార్యలిద్దరికీ విడాకులిచ్చిన ఆమీర్, నాగచైతన్య ఇద్దరూ కలిసి ఇప్పుడు ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంలో నటిస్తున్నారు.
ఇక ఈ యేడాది బ్రేకప్ చెప్పుకున్న వారిలో మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ కూడా ఉంది. మూడేళ్ళుగా రోహ్మాన్ షాల్ లో డేటింగ్ చేస్తున్న సుస్మితాసేన్ అతనితో బంధాన్ని తెంచుకుంటున్నట్టు డిసెంబర్ మాసంలో తెలిపింది.
అలానే ‘పింక్’ మూవీ ఫేమ్ కృతి కుల్హారి తన భర్త సాహిల్ సెహగల్ నుండి విడిపోతున్నట్టు ప్రకటించింది. ‘పింక్’ మూవీ విడుదలకు కొద్దిరోజుల ముందు జూన్ 2016న కృతి, సాహిల్ ను పెళ్ళాడింది. అయితే చట్టప్రకారం తాము విడాకులు తీసుకోవడం లేదని, ఎవరి జీవితాన్ని వారు గడపాలని నిర్ణయించుకున్నామని తెలిపింది.
అలానే ప్రముఖ సంగీత దర్శకుడు డి. ఇమ్మాన్ పన్నెండేళ్ళ తన వివాహ బంధానికి బ్రేకప్ చెప్పేశాడు. భార్య మోనికా రిచర్డ్ కు విడాకులు ఇచ్చినట్టు తెలిపాడు. నిజానికి యేడాది కాలంగా వీరు సపరేట్ గానే ఉంటున్నారని తెలుస్తోంది. విడాకులు మంజూరుకావడంతో ఇమ్మాన్ అధికారికంగా ఈ వార్తను చెప్పాడని అంటున్నారు.
ఇక టీవీ రంగంలో పాపులారిటీ పొందిన వివియన్ డి సేన, నటి వహ్బిజ్ దొరాబ్జీ సైతం విడిపోయారు. ‘ప్యార్ కి యే ఏక్ కహానీ’ సమయంలో ప్రేమలో పడి, 2013లో పెళ్లి చేసుకున్న ఈ బుల్లితెర జంట కోర్టు నుండి అధికారికంగా డిసెంబర్ 18న విడాకులు తీసుకుంది. ఇదిలా ఉంటే… హర్యానాలోని రాజకీయ కుటుంబానికి చెందిన భవ్య బిష్ణోయ్ తో జరిగిన ఎంగేజ్ మెంట్ కాన్సిల్ అయినట్టు గా పాపులర్ హీరోయిన్ మెహ్రీన్ ఆగస్ట్ 25వ తేదీ ప్రకటించింది.
భవ్యతో వివాహ నిశ్చితార్థం జరిగిన తర్వాత వీరిరువూ హాలీడే ట్రిప్ కూడా వేశారు. కానీ ఎందుకు భవ్యకు తాను బ్రేకప్ చెప్పాల్సి వచ్చిందో మెహ్రీన్ వివరించలేదు. మొత్తానికి 2021 చాలా మంది లవర్స్ బ్రేకప్ కు సాక్షీభూతంగా నిలిచింది.
ఇక వీరందరి కోవలోకే వచ్చేలా ఉన్నారు బిగ్ బాస్ ఫేమ్ సిరి ఆమె బాయ్ ఫ్రెండ్ శ్రీహన్. త్వరలోనే వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకోనున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి.