20 Years Of Khadgam: దర్శకుడు కృష్ణవంశీ తన చిత్రాలలో దేశభక్తిని, జాతీయ సమైక్యతను, ఆదర్శభావాలను, పోరాట పటిమను పొందు పరుస్తూ సాగారు. ఆ తీరున ఆయన తెరకెక్కించిన ‘ఖడ్గం’లోనూ ఈ అంశాలన్నీ మనకు కనిపిస్తాయి. దుష్కర చర్యల ముష్యర మూకలు ఓ వైపు, దేశభక్తిని నింపుకున్న హృదయాలు మరోవైపు సాగించిన పోరాటంలో భారతీయులదే అంతిమ విజయం అంటూ ‘ఖడ్గం’ చిత్రం చాటింది. 2002 నవంబర్ 29న విడుదలైన ఈ మూవీ విజయం సాధించింది.
‘ఖడ్గం’ కథ ఏమిటంటే.. ఉగ్రవాది మసూద్‌ను అరెస్ట్ చేసి హైదరాబాద్ జైలులో బంధించి ఉంటారు. అతడిని విడిపించడమే దేవుని సేవ అన్న తీరులో బోధించి కొంతమంది సుశిక్షితులైన టెర్రరిస్టులను హైదరాబాద్ కు పంపిస్తారు. కోటి టాప్ స్టార్ కావాలన్న కలతో హైదరాబాద్ కు వస్తాడు. ప్రతి స్టూడియోలోనూ అతనికి గెంటివేతే ఎదురవుతుంది. అయినా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతుంటాడు. అంజాద్ అనే ఆటోడ్రైవర్ సంప్రదాయ ముస్లిమ్. అంతేకాదు అంజాద్ లో దేశభక్తి కూడా ఉంటుంది. అతని తమ్ముడు అజర్ ఓ యేడాదిగా కనిపించకుండా పోయి ఉంటాడు. రాధాకృష్ణ ఓ సిన్సియర్ పోలీసాఫీసర్. అతనిలోనూ దేశభక్తి అణువణువునా ఉంటుంది. పాకిస్థాన్ టెర్రరిస్టులకు ఆశ్రయమిస్తున్న దేశమని, అక్కడివారంటే రాధాకృష్ణకు అసహ్యం. అంతేకాదు, అందరు ముస్లిమ్స్ దేశద్రోహులే అన్న భావనతోనూ ఉంటాడు. రాధాకృష్ణకు అంతటి ద్వేషం కలగడానికి ఐయస్ఐ ఫోర్సెస్ చేతిలో ఆయన ప్రేయసి స్వాతి మరణించి ఉంటుంది.
ఇక సీతామాలక్ష్మి సినిమాల్లో వేషాల కోసం వేట ఆరంభిస్తుంది. ఆమెకు తోడుగా తల్లి కూడా వస్తుంది. సీతామాలక్ష్మికి కోటికి పరిచయం అవుతుంది. అది ప్రేమగా మారుతుంది. కానీ, వేషాల కోసం సీతామాలక్ష్మి దిగజారిందని తెలిసి కోటి అసహ్యించుకుంటాడు. మసూద్ ను విడుదల చేయడానికి టెర్రరిస్ట్ ఎటాక్ ప్లాన్ చేసేది అంజాద్ తమ్ముడు అజర్. ఏ ట్రైయిన్‌లో అయితే అజర్ ప్లాన్ చేశాడో అందులోనే కోటి, సీతామాలక్ష్మి కూడా ప్రయాణిస్తుంటారు. వారితో పాటు రాధాకృష్ణ అంటే అభిమానించే పూజ కూడా ఉంటుంది. అజర్ చేతిలో ఎంతోమంది ప్రాణాలు ఉన్నాయని తెలిసి, మసూద్ ను విడుదల చేసేందుకు నిర్ణయిస్తారు. అతడిని తీసుకొని రాధాకృష్ణ రైల్వే స్టేషన్ కు వస్తాడు. అయితే వారితో పాటే వచ్చిన అజర్ అన్న అంజాద్ తమ్ముడు చేసేది తప్పు అని చెబుతాడు. అజర్, పూజను అడ్డు పెట్టుకొని మసూద్ ను కాపాడాలని భావిస్తాడు. మసూద్ ను వదలకూడదని, వాడు భారతదేశానికి ద్రోహి అని వాడిని గొంతు నులిమి చంపేస్తాడు అంజాద్. ఆలోగా వెనకాల నుండి వచ్చి, అజర్ పై కోటి దాడి చేస్తాడు. పోలీసులకు అజర్ దొరుకుతాడు. అంజాదే అతడిని చంపేయమని చెబుతాడు. అంజాద్ తో పాటు అక్కడ ఉన్న వారందరూ ‘వందేమాతరం’ అంటూ నినదిస్తూండగా, రాధాకృష్ణ చేతిలోని రివాల్వర్ బుల్టెట్స్ కు అజర్ బలి అవుతాడు. తరువాత తన తల్లిని అంజాద్ మక్కాకు తీసుకు వెళ్తూండగా, వారికి వీడ్కోలు చెప్పడానికి రాధాకృష్ణ, కోటి వస్తారు. అందరూ తన సోదరులేనని అంజాద్ అంటాడు. అతని తల్లి దీవిస్తుంది, ఆనందంగా వారు చిందులేస్తూండగా కథ ముగుస్తుంది.
ఈ చిత్రంలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, సోనాలీ బింద్రే, కిమ్ శర్మ, సంగీత, ఉత్తేజ్, పావలా శ్యామల, ఆహుతి ప్రసాద్, షఫీ, పృథ్వీ, బ్రహ్మాజీ, వాసు, సుబ్బరాజు, రఘు బాబు, ఎమ్.ఎస్.నారాయణ నటించారు.
ఈ చిత్రానికి సీతారామశాస్త్రి, అశోకతేజ, శక్తి, విజయకుమార్ పాటలు పలికించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. సత్యానంద్ అడిషనల్ స్క్రీన్ ప్లే రూపొందించారు. ఈ సినిమాకు మాటలు ఉత్తేజ్ అందించారు. కృస్ణవంశీ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మధుమురళి నిర్మించారు. ఇందులోని ‘మేమే ఇండియన్స్..’, ‘నువ్వు నువ్వు..’, ‘అహ అల్లరి..’, ‘గోవిందా గోవిందా..’, ‘ముసుగు వెయ్యొద్దు..’ అంటూ సాగే పాటలు అలరించాయి. ఇందులోని ‘మేమే ఇండియన్స్..’ సాంగ్ జాతీయ పర్వదినాల్లో విశేషంగా వినిపిస్తూనే ఉంటుంది.
‘ఖడ్గం’ చిత్రాన్ని హిందీలో ‘మర్తే దమ్ తక్’గా, తమిళంలో ‘మాణిక్ బాషా’గానూ, భోజ్ పురిలో ‘బేమిసాల్ హై హమ్’గానూ అనువదించారు. ఈ కథకు కొన్ని మార్పులూ, చేర్పులూ చేసి కె.సుభాష్ దర్శకత్వంలో ‘ఇన్సాన్’ పేరుతో హిందీలో రీమేక్ చేయగా, ఆ సినిమా పరాజయం పాలైంది.
(నవంబర్ 29న ‘ఖడ్గం’కు 20 ఏళ్ళు)