ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమాలలో దేశవ్యాస్తంగా సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో కె.జి.ఎఫ్2 ఒకటి. కెజిఎఫ్ పార్ట్ వన్ సాధించిన విజయం సీక్వెల్ పై అంచనాలను రెట్టింపు చేసిందనే చెప్పాలి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యష్ హీరోగా సంజయ్ దత్ విలన్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో రికార్డులను బద్దలు కొట్టి 200 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది. నిజానికి ఈ సినిమా జూలై 16 న ప్రేక్షకుల ముందుకు రావలసి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ తో లాక్ డౌన్, థియేటర్ల మూసివేతతో విడుదల వాయిదా పడింది.
అయితే ఈ సినిమా కొత్త విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. కానీ ఓ పెద్ద OTT ప్లాట్‌ఫాం డైరెక్ట్ గా డిజిటల్ లో విడుదల చేయటానికి భారీ డీల్ ఆఫర్ చేసినట్లు వినిపిస్తోంది. దాదాపు 255 కోట్లు ఓటీటీ రిలీజ్ కోసం ఆఫర్ చేసినట్లు సమాచారం. నిజానికి మన భారతీయ సినిమాలకు సంబంధించి ఇది అతి భారీ ఓటీటీ డీల్. అయితే సినిమాను ఎట్టిపరిస్థితుల్లో థియేట్రికల్ రిలీజ్ చేయాలన్నదే హీరో యష్ తో పాటు యూనిట్ భావిస్తోంది. మరి ఊహించని విధంగా విడుదల ఆలస్యం అవుతూ వస్తున్న సమయంలో థియేటర్ రిలీజ్ కే వెళతారా? లేక లాభదాయకమైన డిజిటల్ ఒప్పందం కుదుర్చుకుంటారా అన్నది చూడాలి.