Acharya: ప్రస్తుత కాలంలో ప్రేక్షకుల అభిరుచులు మారిపోయాయి. కథ నచ్చితేనే తప్ప థియేటర్ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అది స్టార్ హీరో సినిమా అయినా.. సూపర్ కాంబో అయినా కూడా ప్రేక్షకులు కొంచెం కూడా కనికరించడం లేదు. అందుకు ఉదాహరణే ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి- రామ్ చరణ్ కాంబో, అప్పటివరకు ప్లాప్ అందుకొని దర్శకుడు.. కొణిదెల ప్రొడక్షన్స్.. ఇంకేం కావాలి హైప్ రావడానికి.. అనుకున్నారు అభిమానులు. సినిమా మొదలైనప్పటి నుంచి రిలీజ్ అయ్యేవరకు హైప్ పెంచి.. పెంచి మేకర్స్ పిచ్చెక్కించారు. స్టార్ డైరెక్టర్స్ తో ఇంటర్వ్యూలు, మెగాస్టార్,రామ్ చరణ్ కలిసి నటించడం సురేఖ కల అని, ఆ కల తీరిపోయిందని, వారిద్దరూ డ్యాన్స్ చేస్తుంటే సురేఖ, చిరు తల్లి అంజనా దేవి మురిసిపోయారని ఇలా ఒకటని ఏంటి ఎంత ప్రమోషన్స్ చేయాలో అంత ప్రమోషన్స్ చేశారు.
ఏప్రిల్ 29, 2021.. మెగా ఫ్యాన్స్ కు మర్చిపోలేని రోజు.. ఉదయమే ప్రీమియర్ షోస్ కోసం నైట్ నుంచి కష్టపడి నిద్ర మానుకొని ఎదురుచూసి.. బొమ్మపడగానే మెగాస్టార్, మెగాస్టార్ అని అరిచిన కాసేపటికే ఆ అరుపులు మాయమయ్యాయి. ఇంకేముంది మొదటిరోజే మిక్స్డ్ టాక్ అందుకుంది. పాదఘట్టం తప్ప సినిమాలో ఏమి లేదని అభిమానులు తేల్చేశారు.
ఇక చిరును.. విఎఫ్ఎక్స్ లో కుర్రవాడిగా చూపించడం అయితే బ్లండర్ మిస్టేక్ అని చెప్పుకొచ్చారు. ఎంతో ఊత్సాహంగా థియేటర్ లోపలి వెళ్లినవారు ఉసురుమంటూ బయటికి వచ్చారు. అయితే ఈ సినిమా ప్లాప్ కు కారణం చిరు అని కొందరు కొరటాల అని కొందరు ఇప్పటికీ చచర్చించుకుంటూనే ఉన్నారు. ఆ విషయం పక్కన పెడితే ఈ కళాఖండం రిలీజ్ అయ్యి నేటికీ ఏడాది. దీంతో 1 Year For Aacharya అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
ఇక ఈ ట్రెండ్ చూసి మెగా ఫ్యాన్స్ తమదైన శైలిలో కౌంటర్లు ఇస్తున్నారు. కొంతమంది ఎందుకు మాస్టారు.. ఆ పాదఘట్టాన్ని మళ్లీ గుర్తుచేసి చంపుతారు అని అంటుండగా.. ఇంకొంతమంది.. ఒక్క ప్లాప్ వస్తే మెగాస్టార్ పని అయిపోయింది అనుకున్నారు.. వాల్తేరు వీరయ్య తో ఏడాదిలోపే భారీ విజయాన్ని అందుకున్నాడు. అది మెగాస్టార్ రేంజ్ అంటూ.. చెప్పుకొస్తున్నారు.