మద్యం తాగకపోయినా ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుందో మీకు తెలుసా? యుఎస్‌కు చెందిన వైద్యుడు, గట్ హెల్త్ నిపుణుడు డాక్టర్ పాల్ కాలేయం దెబ్బతినడానికి ప్రధాన కారణాలను ఇటీవల ఒక పోస్ట్‌లో వివరించారు. “మీరు మద్యం తాగకపోతే కాలేయం దెబ్బతినదు అని అనుకోవడం పూర్తిగా అపోహ” అని ఆయన స్పష్టం చేశారు. లివర్ సమస్యలకు ప్రధాన కారణాలు మన జీవనశైలి తరచుగా మనం లెక్కచేయని చిన్న చిన్న రోజువారీ అలవాట్లేనని ఆయన చెప్పుకొచ్చారు.
అయితే.. చాలా మంది కాలేయ సమస్యలు మద్యపానం చేసే వారికే వస్తాయని భావిస్తారు. మన ప్రతిరోజూ తినే ఆహారపు అలవాట్లలోనే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాలేయ నష్టానికి సంబంధించిన ప్రారంభ లక్షణాలు సాధారణంగా గుర్తించలేమని వారు తెలిపారు. అవి స్పష్టంగా కనిపించే సమయానికి, కాలేయం చాలా వరకు దెబ్బతిన్నదనే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు.
ఈ రోజుల్లో తాను చూస్తున్న అనేక కాలేయ సమస్యలు మద్యం వల్ల కాదని డాక్టర్ పాల్ చెప్పారు. అందువల్ల “నేను మద్యం తాగను కాబట్టి నా లివర్ బాగానే ఉంటుంది” అనే నమ్మకం సరైంది కాదని ఆయన హెచ్చరించారు. మనకు పెద్దగా అనిపించని కొన్ని రోజువారీ అలవాట్లు కాలేయానికి పెద్ద నష్టం చేస్తాయి. అధిక చక్కెర ఉన్న ఆహారం తీసుకోవడం, రోజంతా చిన్న చిన్న చిరుతిళ్లు తింటూ ఉండటం వల్ల ఇన్సులిన్ స్థాయిలు పెరగడం, తగినంత నిద్ర లేకపోవడం, నిరంతర ఒత్తిడి అనుభవించడం మొదలైనవి. ఇవన్నీ కలిసి కాలేయంపై ఒత్తిడి పెంచి, దాని పనితీరును క్రమంగా దెబ్బతీస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. దీనివల్ల కాలేయం మరింతగా శ్రమించాల్సి వస్తుంది. కాలక్రమేణా ఇది కాలేయ నష్టానికి దారితీస్తుంది.
అయితే.. కాలేయానికి స్వయం చికిత్స సామర్థ్యం ఉంది. మనం జీవనశైలి, ఆహారంలో కొన్ని మార్పులు చేస్తే, పేగు ఆరోగ్యం మెరుగుపడితే, సరైన ఆహారపు అలవాట్లు ఏర్పాటు చేసుకుంటే, అలాగే తగినంత నిద్ర తీసుకుంటే కాలేయం మళ్లీ నయం కావడం ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు.