మనలో చాలామంది నీరు తాగడాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. డాక్టర్లు చెబితేనో, ఇంటి దగ్గర అమ్మ కోప్పడితేనో మంచినీరు తాగుతారు… అలాఅని వారు ఏమీ తాగకుండా ఉండరు. శరీరానికి హానిచేసే కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. అది ఎంతమాత్రం మంచిది కాదని గ్రహించాలి. మనం ఉదయాన్నే నిద్రలేవగానే ఒకటి లేదా రెండు గ్లాసుల నీటిని తప్పకుండా తీసుకోవాలి. ఇలా తీసుకున్న నీరు మన దాహార్తిని తీర్చడంతో పాటు, శరీరంలోని అన్ని అవయవాలను ఉత్తేజపరిచి, మన శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు పంపడానికి దోహదపడుతుంది.
ప్రతి రోజు నీరు తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్య (Constipation Problem) కూడా తగ్గుతుంది. ఉదయం నిద్రలేచిన వెంటనే గోరువెచ్చని నీరు (Warm Water) తాగడం ఇంకా మంచిది. ఎందుకంటే రాత్రి మనం తిన్న ఆహారం అంతా జీర్ణం అయి పేగుల్లోంచి విసర్జనకు సిద్ధం అవుతుంది. ఆ సమయంలో గోరువెచ్చని నీరు తాగితే వ్యర్థ పదార్ధాలు అన్నీ కడిగివేయబడి.. సుఖ విరేచనం అవుతుంది. మనం బాత్ రూంకి వెళ్లేముందు ఇలా చేస్తే సగం ఆరోగ్య సమస్యలను నీటితో దూరం చేయవచ్చన్నమాట.
Read Also: Ali vs Pawan Kalyan: ఆలీ సంచలన ప్రకటన.. పవన్ కల్యాణ్‌పై పోటీకి రెడీ
స్నానం చేయడానికి కొంచెం సేపు ముందు ఒక గ్లాసు నీటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు (Health Experts) చెప్తున్నారు. ఇలా చేయడం వలన ఇది శరీరంలోని అధిక రక్తపోటు వంటి సమస్యను నివారించడంలో సహాయపడుతుంది. అలానే మధ్యాహ్నం ఆహారం తీసుకునే ఒక అరగంట ముందు నీరుని తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇది కేవలం మన జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా, మనం తీసుకునే ఆహారంలోని పోషకాలు శరీరం తేలిగ్గా గ్రహించేందుకు ఉపకరిస్తుంది. ఆయుర్వేద నిపుణులు మంచినీరే మన శరీరానికి జీవామృతం అంటుంటారు. ఒకరోజంతా మంచినీరు తాగి ఉపవాసం ఉంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది.
వ్యాయామం చేసే అలవాటు ఉన్నవారు, వ్యాయామానికి ముందు రెండు గ్లాసులు నీరు తీసుకోవాలి. వ్యాయామం వల్ల చెమట పడుతుంది. మన శరీరం డిహైడ్రేషన్ బారిన పడకుండా ఇది ఎంతగానో కాపాడుతుంది. వ్యాయామం చేసిన తర్వాత కూడా ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి. మరో ముఖ్యమయిన విషయం ఏమిటంటే పరిగెత్తిన వెంటనే, కాస్త దూరం నడిచిన వెంటనే నీటిని తాగకూడదు. కాసింత స్థిమిత పడిన తర్వాత నీటిని తీసుకోవడం శ్రేయస్కరం. వాటర్ థెరపీ ద్వారా మీరు అద్భుత ప్రయోజనాలు పొందవచ్చు. ఎట్టి పరిస్థితిల్లో గంటల తరబడి నీళ్ళు తాగకుండా ఉండిపోవద్దు. దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు తప్పకుండా వెంట వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళండి. బయట దొరికే వాటర్ బాటిల్స్ ఏవి బడితే అవి తాగి ఆరోగ్యం పాడుచేసుకోవద్దు.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.