మన దేశంలో చాలామందికి టీతో కలిసి బిస్కెట్లు తినడం రోజువారీ అలవాటుగా మారింది. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు టీతో పాటు బిస్కెట్లు తినడం ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. అయితే ఈ అలవాటు శరీరానికి హానికరని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
మార్కెట్‌లో లభించే బిస్కెట్లలో ఎక్కువగా శుద్ధి చేసిన పిండి, చక్కెర, ఉప్పు, ప్రిజర్వేటివ్‌లు ఉంటాయని న్యూట్రిషియన్లు చెబుతున్నారు. ఇవి టీతో కలిసి తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగి తర్వాత వేగంగా పడిపోతాయంటున్నారు. దీర్ఘకాలంలో ఈ మార్పులు ఇన్సులిన్ నిరోధకతకు, మధుమేహానికి దారితీయవచ్చంటున్నారు. అదనంగా టీలోని కేఫిన్, టానిన్లు ఖాళీ కడుపులో ఆమ్లత్వాన్ని పెంచుతాయి. బిస్కెట్లలోని శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఆమ్లత్వం, గుండెల్లో మంట, అజీర్తి వంటి సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయని నిపుణులు తెలిపారు.
అయితే టీ, బిస్కెట్ల కలయిక పేగుల్లోని మంచి బ్యాక్టీరియాలను బలహీనపరచి జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుందని న్యూట్రిషియన్లు చెబుతున్నారు. దీంతో గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు రావచ్చన్నారు.బిస్కెట్లలో ఫైబర్ తక్కువగా ఉండటం, అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండటం వల్ల బరువు పెరగుతారన్నారు. ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుందన్నారు. వీటిని నివారించాలంటే ఖాళీ కడుపుతో టీ–బిస్కెట్లు తినే అలవాటును మానుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వీటికి బదులు ఆరోగ్యాన్ని మెరుగైన పరిచే ఆహార పానీయాలను తీసుకోవాలంటున్నారు.