ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను త్వరగా పూర్తి చేయాలనుకునే వర్కింగ్ ఉమెన్స్‌కి, రూమ్స్‌లో ఉండే విద్యార్థులకి… లేదంటే ఎప్పుడంటే అప్పుడు వేడి వేడి పెసరట్టు తినాలనుకునే వారికి ఇది ఒక గొప్ప పరిష్కారం! ప్రతిసారి పప్పు నానబెట్టి, రుబ్బే శ్రమ లేకుండా, కేవలం నిమిషాల్లో పెసరట్టు వేసుకోవడానికి వీలుగా ఉండే పెసరట్టు ప్రీమిక్స్ పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూదాం. ఫ్రిజ్‌తో పని లేకుండా బయటే మూడు నెలల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఈ పెసరట్టు ప్రీమిక్స్ పౌడర్ తయారీ, దానిని ఉపయోగించే విధానం ఇక్కడ తెలుసుకోండి.
పెసరట్టు ప్రీమిక్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు
పెసలు (Green Gram): 4 కప్పులు
బియ్యం (Rice): 1/2 కప్పు (ఏ రకం బియ్యం అయినా వాడవచ్చు)
మసాలా దినుసులు:
ఎండు అల్లం (సొంటి): 10 గ్రాములు (చిన్న ముక్కలుగా)
మిరియాలు: 3/4 టేబుల్ స్పూన్
జీలకర్ర: 1 టేబుల్ స్పూన్
ఎండుమిర్చి: 3 లేదా 4
కరివేపాకు: 3/4 కప్పు (తడి లేకుండా ఆరబెట్టుకోవాలి)
ఇంగువ: 1 టీస్పూన్
పసుపు: 1/4 టీస్పూన్
సాల్ట్ (ఉప్పు): 1 టీస్పూన్ (లేదా రుచికి సరిపడా)
పెసరట్టు పొడి తయారీ విధానం
ముందుగా పెసలు, బియ్యాన్ని కలిపి ఒకటి, రెండు సార్లు కడిగేసుకోవాలి. పప్పులు నానకూడదు, కేవలం శుభ్రం చేయాలి. కడిగిన పెసలు, బియ్యాన్ని ఒక జాలి గిన్నెలో వేసి నీరంతా వడకట్టాలి. ఆ తర్వాత వాటిని ఒక కాటన్ క్లాత్‌పై పల్చగా పరిచి, ఎండలో కానీ, లేదంటే ఫ్యాన్ కింద రాత్రంతా ఆరబెట్టుకోవాలి. పూర్తిగా ఎండిన తర్వాత, కొద్దికొద్దిగా పాన్‌లో వేసి, కేవలం రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. చేత్తో తాకితే కొంచెం వేడి తగిలేంత వరకు వేయించాలి. తర్వాత అదే పాన్‌లో సొంటి, మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి రెండు నిమిషాలు వేయించి పక్కన పెట్టాలి. కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి.
ఇక ముందుగా సొంటి ముక్కలను రోట్లో కచ్చాపచ్చాగా దంచుకోవాలి (డైరెక్ట్‌గా మిక్సీలో వేస్తే కష్టం). దంచిన సొంటి, వేయించిన మసాలా దినుసులు, కరివేపాకు, ఇంగువ, పసుపు, ఉప్పుతో కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత వేయించి చల్లార్చిన పెసలు, బియ్యం మిశ్రమాన్ని కూడా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి (మిక్సీ జార్‌లో సగం వరకు మాత్రమే వేసి గ్రైండ్ చేస్తే బాగా నలుగుతుంది). ఈ పెసరట్టు పొడిని, మసాలా పొడిని ఒక వెడల్పాటి ప్లేట్‌లో వేసి, మొత్తం అంతా బాగా కలిసేలాగా చేత్తో బాగా కలుపుకోవాలి. గ్రైండ్ చేసిన వెంటనే పొడి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి, పూర్తిగా చల్లారిన తర్వాతే గ్లాస్ జార్‌లో లేదా గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. దీని ఫ్రీజ్ లో పెట్టాల్సిన పని లేదు.
ఈ ప్రీమిక్స్‌తో పెసరట్టు వేసుకునే విధానం :
ఒక కప్పు ప్రీమిక్స్ పొడికి, ఒక కప్పు నీళ్ళు కొద్దికొద్దిగా పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కనీసం అరగంట పాటు నానబెట్టాలి. ఒక గంట లేదా రెండు గంటలు నానబెడితే దోసలు మరింత బాగా వస్తాయి. నానిన తర్వాత పిండి కొంచెం చిక్కబడుతుంది కాబట్టి, మరో కొంచెం నీళ్లు, అవసరమైతే కొద్దిగా ఉప్పు వేసి గరిట జారుడు గా ఉండేలా కలుపుకోవాలి (మరీ గట్టిగా ఉంటే దోస గట్టిగా వస్తుంది). ఇక స్టవ్ వెలిగించి పాన్ బాగా వేడెక్కిన, లో ఫ్లేమ్‌లో పెట్టి దోస వేయ్యాలి. నూనె/నెయ్యి వేసి, ఎర్రగా కాలిన తర్వాత అల్లం చట్నీ తో కలిపి వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. (ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ వేసి ఆనియన్ పెసరట్టు కూడా వేసుకోవచ్చు). ఇక ఈ ప్రీమిక్స్ పొడి వర్కింగ్ ఉమెన్, రూమ్స్‌లో ఉండే వారికి చాలా బాగా ఉపయోగపడుతుందని, బిజీ డేస్‌లో సమయాన్ని ఆదా చేస్తుంది.