Moringa Leaf Soup: మునగ చెట్టు ఒక పోషకాల గని. అందులోనూ మునగాకు అందించే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. రక్తహీనతను పారద్రోలాలన్నా, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలన్నా మునగాకును మించిన ఆహారం లేదు. సాధారణంగా మునగాకు అంటే చేదుగా ఉంటుందని చాలామంది దూరంగా ఉంటారు. కానీ సరైన మసాలా దినుసులు, కూరగాయలు జోడించి చేసే ఈ చారు కమ్మని రుచితో పాటు మనసుకు హాయిని ఇస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతటి శక్తివంతమైన మునగాకును రుచికరమైన ‘సూప్’ లేదా ‘చారు’ రూపంలో ఎలా తీసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం!
READ ALSO: Moringa Chapati: డయాబెటిస్‌తో ఇబ్బంది పడుతున్నారా.. మునగాకు చపాతీలతో చెక్ పెట్టండి
మునగాకు చారుకు కావలసిన పదార్థాలు: తాజా మునగాకు ఒక గిన్నెడు, పెసరపప్పు 2 టేబుల్ స్పూన్లు (నానబెట్టినవి), టొమాటోలు 2, ఉల్లిపాయలు 2, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, మసాలా దినుసులు (లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు), పసుపు, ఉప్పు, నూనె/నెయ్యి
తయారీ క్రమం: ముందుగా కుక్కర్‌లో ఒక టీస్పూన్ నూనె వేసి వేడి చేయాలి. అందులో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. మసాలాలు వేగుతున్నప్పుడు వచ్చే సువాసన చారుకు ప్రత్యేకతను ఇస్తుంది. మసాలాలు వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. ఆపై టొమాటో ముక్కలు, నానబెట్టిన పెసరపప్పు, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత ఇందులో మూడు కప్పుల నీళ్లు పోసి, శుభ్రం చేసుకున్న తాజా మునగాకును వేయాలి. కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
ప్రెషర్ పోయాక ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. అందులోని బిర్యానీ ఆకును తొలగించి, మిగిలిన పదార్థాలను చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఒక సాస్ పాన్‌లో ముందుగా వడకట్టిన నీటిని పోసి, అందులో రుబ్బిన పేస్ట్‌ను కలపాలి. ఈ మిశ్రమాన్ని తక్కువ మంటపై కాసేపు మరిగించాలి. చారు చిక్కదనాన్ని బట్టి మరికొన్ని నీళ్లు పోసుకోవచ్చు. చివరగా మరికొంచెం మిరియాల పొడి, ఉప్పు సర్దుబాటు చేస్తే ఘుమఘుమలాడే మునగాకు చారు సిద్ధం అవుతుంది. ఈ చారు వేడివేడిగా ఉన్నప్పుడే తీసుకుంటే జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూవారీ ఆహారంలో ఈ ఆరోగ్యకరమైన సూప్‌ను చేర్చుకోవడం ద్వారా పోషక లోపాలను అధిగమించవచ్చని సూచిస్తున్నారు.
READ ALSO: Director Maruthi: ‘రాజాసాబ్’ సినిమా నుంచి నేర్చుకుంది ఇదే: డైరెక్టర్ మారుతి