Interesting News: ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుంది. చేసే ఉద్యోగంలో వాళ్లకు సంతృప్తి ఉండదు. ఇంకా ఏదో సాధించాలని తపన పడుతుంటారు. కొత్తగా ప్రయత్నించాలని నిత్యం ఆలోచిస్తుంటారు. భిన్నమైన గుర్తింపు తెచ్చుకోవాలనే ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. అలాంటివారికి తాజా ఉదాహరణ నవీన్ సింగ్. బెంగళూరు ఐఐఎంలో ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ (ఈజీఎంపీ) పూర్తి చేసి మార్కెటింగ్ ప్రొఫెషనల్ కెరీర్‌ని ఎంచుకున్నాడు. రిలయెన్స్ పెట్రోలియం, ఐసీఐసీఐ బ్యాంక్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తదితర పెద్ద సంస్థల్లో పనిచేశాడు. కానీ ఏదో తెలియని వెలితి ఆయన్ని వెంటాడేది.
దీంతో సొంతగా బిజినెస్ వెంచర్‌ని ప్రారంభించాలనుకున్నాడు. ఏం చేయాలా అని పరిశోధించాడు. ఎట్టకేలకు ఒక ఐడియా వచ్చింది. దేశవ్యాప్తంగా రోడ్ నెట్‌వర్క్ పెరుగుతోంది. అత్యుత్తమ జాతీయ రహదారులు రూపుదిద్దుకుంటున్నాయి. దీంతో రోడ్డు మార్గంలో సొంత వాహనాల్లో ప్రయాణించేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీనికి తగ్గట్లే రోడ్ల వెంట రెస్టారెంట్లు, హోటళ్లు, ఫుడ్ ఔట్‌లెట్లు వెలుస్తున్నాయి. కానీ ఆ రేంజ్‌లో క్లీన్ అండ్ గ్రీన్ పబ్లిక్ టాయిలెట్లు, డీసెంట్ రెస్ట్ రూమ్స్ లేకపోవటాన్ని నవీన్ సింగ్ గుర్తించాడు. హైజినిక్ వాష్ రూమ్స్ కొరత ఆయనకు కొట్టొచ్చినట్లు కనిపించింది.
read also: AP IAS Officer: కొడుకుని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసిన ఏపీ ఐఏఎస్ ఆఫీసర్
ఈ లోటు దివ్యాంగులకు మరింత ఇబ్బందికరంగా మారింది. దీంతో బెంగళూరు-సాలెం నేషనల్ హైవే (ఎన్‌హెచ్-44) పక్కన లవాటో పేరుతో ‘పే అండ్ యూజ్’ టాయిలెట్‌ని అద్భుతంగా ఏర్పాటుచేశాడు. 2018లో అందుబాటులోకి తెచ్చిన ఈ సదుపాయం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. విశాలవంతమైన ప్రదేశంలో ఏర్పాటుచేసిన ఈ టాయిలెట్స్ చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి. వాహనాల పార్కింగ్‌కి సైతం అనుకూలంగా ఉంది. లేడీస్‌కి, జెంట్స్‌కి సపరేట్‌గా టాయిలెట్స్ కట్టించారు. ఇక్కడ స్నానం చేసేందుకు షవర్లు ఉన్నాయి. 12 ఏళ్ల లోపు పిల్లలు టాయిలెట్ వాడుకుంటే రూ.10, పెద్దోళ్లకు రూ.30 చెల్లించాలి.
పిల్లలు స్నానం చేస్తే రూ.100, పెద్దలకు రూ.200 వసూలు చేస్తున్నారు. రేట్లు ఎక్కువ అనిపించొచ్చు. కానీ ఈ వాష్ రూమ్‌లు ఎంత నీట్‌గా, హైఫైగా ఉన్నాయో చూస్తే ధరలను అసలు పట్టించుకోం. ఈ ఫెసిలిటీస్ కావాలనుకునేవారికి ప్రైవేట్ రూమ్‌లు కేటాయిస్తారు. ఆ గదుల్లో స్టోరేజ్ ర్యాక్స్, షవర్ ఏరియా ఉంటాయి. చిన్న పిల్లలకు సహాయకులు ఉంటారు. రూ.10 చెల్లిస్తే శానిటరీ న్యాప్‌కిన్ ఇస్తారు. దుస్తులు మార్చుకునే గది, పిల్లలకు డైపర్లు మార్చుకునే గది, పిల్లలకు, పెద్దలకు సెపరేట్‌గా వీల్ చైర్లు ఉన్నాయి.
టచబుల్ ఆటోమేటిక్ సోప్ డిస్పెన్సర్, టచ్ లెస్ ఆటోమేటిక్ శానిటైజర్, హ్యాండ్ డ్రయర్, టచ్ లెస్ ఆటోమేటిక్ హ్యాండ్/ఫేస్ వాష్ ఏరియా, ప్రార్థన/నమాజ్ చేసుకునే ప్రాంతం తదితర సదుపాయలు ఇక్కడ ఉన్నాయి. అదర్ పెయిడ్ సర్వీస్‌ల కింద వర్క్ స్టేషన్ ఉంది. దీన్ని గంటల లెక్కన ఇస్తారు. దీంతోపాటు డైనింగ్ టేబుల్ ఉంది. దాని పైన మన ఫుడ్డు తినొచ్చు. వర్క్ స్టేషన్‌కి గంటకి రూ.100 చెల్లించాలి. డైనింగ్ టేబుల్ మీద మన భోజనం మనం చేసినందుకు రూ.20 కడితే సరిపోతుంది. వీటితోపాటు రిటైల్ కన్వేయన్స్ స్టోర్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది.
ఇందులో టూత్ బ్రష్, పేస్ట్, టవల్, షాంపూ, శానిటరీ న్యాప్‌కిన్, పెయిన్ బామ్ మెడిసిన్, కిడ్స్ డైపర్, దువ్వెన, షేవింగ్ రేజర్ తదితర వస్తువులు లభిస్తాయి. కార్ వాష్ సర్వీస్ కూడా ఉంది. రూ.150 చెల్లిస్తే ఫ్రంట్ విండ్ షీల్డ్ గ్లాస్, రేర్ గ్లాస్, ఆల్ డోర్ గ్లాస్, ఆల్ టైర్ ఫ్రేమ్ వాష్, ఫుల్ బాడీ వాటర్ వాష్ వంటివి చేస్తారు. దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు మధ్యలో కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలనుకునేవారికి, ఫ్రెషప్ అవ్వాలనుకునేవారికి ఈ లవాటో టాయిలెట్ షాపు బ్రహ్మాండంగా ఉపయోగపడుతోంది. కస్టమర్లు చాలా మంచి ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. ‘నవీన్ సింగ్.. యువర్ ఐడియా ఈజ్ వండర్‌ఫుల్’ అని మెచ్చుకుంటున్నారు.