Peace Of Mind Tips: ఈ ఆధునిక సాంకేతిక యుగంలో సంతోషంగా జీవించడం అనేది ప్రతి మనిషికి పెద్ద టాస్క్ అయిపోయింది. నిత్యం ఎంతో మంది ఎన్నో ఆలోచనలతో వాళ్ల జీవితాలను వెళ్లదీస్తున్నారు. చేసే పనిలో ప్రశాంతత లేక, కుటుంబంతో జీవించడానికి సరిపడ డబ్బులు చాలక అనేక మంది ఎన్నో అవస్థలు ఎదుర్కొంటూ జీవిత గమనంలో ముందుకు సాగిపోతున్నారు. వాస్తవానికి ఈ ఆధునిక కాలంలో భగవద్గీత మనకేమి బోధిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా..
READ ALSO: Scooters: కొత్త స్కూటర్ కొనాలనుకుంటున్నారా?.. రూ. 50 వేల లోపు అందుబాటులో ఉన్న టాప్ స్కూటర్లు ఇవే..
ఏనాడో రాసిన భగవద్గీతలో ఈ ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. ఈ ప్రాచీన జ్ఞాన గ్రంథం నేటి జీవితానికి చాలా ముఖ్యమైనదిగా పలువురు విశ్లేషకులు, మానసిన నిపుణులు చెబుతున్నారు. నిజానికి భగవద్గీతలో ఒక మనిషి గురించి, అతని వ్యక్తిత్వం గురించి, ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో వంటి అంశాల గురించి వివరణాత్మకంగా ఉన్నాయి. భగవద్గీత బోధనలు మనలో సానుకూలతను పెంచడంతో పాటు, జీవితంపై ఆశను కలిగిస్తాయని చెబుతున్నారు.
మార్పులు ఇబ్బంది పెట్టవచ్చు.. అయినా స్వీకరించాలి
జీవితంలో స్థిరంగా ఉండే ఏకైక విషయం మార్పు. ఋతువులు మారడం ఎంత సహజమో మార్పు అనేది కూడా అంతే సహజం. పగలు రాత్రిగా మారినట్టు, ప్రతి మనిషి జీవితంలో మార్పు ఏదో రకంగా వస్తూనే ఉంటుంది. ఆ మార్పుకు మీరు సిద్ధంగా ఉండాలి. కొన్ని మార్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అయినా సరే వాటిని సానుకూలంగా తీసుకొని జీవితంలో ముందుకే సాగాలి. మార్పుకు అందరు సిద్ధంగా ఉండాలని భగవద్గీత చెబుతుంది. నేటి ధనవంతులు రేపటికి పేదవారు కావచ్చు, ఈ రోజు దరిద్రంలో జీవిస్తున్న వారు రేపు కోటీశ్వరులు కావచ్చు. ఇదే సమయంలో నేడు కీర్తి, అదృష్టం రెండూ ఉన్న వారికి రేపటి రోజున అవి పోవచ్చు, అలాగే మరికొందరికి ఊహించని విధంగా విపరీతమైన పేరు ప్రఖ్యాతలు రావచ్చు. అన్నింటికి సిద్ధంగా ఉండాలని, మార్పును జీవితాల్లోకి ఆహ్వానించాలని మానసిక నిపుణులు చెబుతున్నారు.
ఉన్నంతలో సంతోషంగా ఉండండి..
భగవద్గీత బోధనల ప్రకారం.. జీవితం మీకు ఏది ఇచ్చిందో దాన్ని స్వీకరించి ప్రశాంతంగా జీవించేందుకు ప్రయత్నించండి. ఏ విషయం గురించి ఆందోళన చెందకండి. ఉన్నంతలో సంతోషంగా ఉండండి. సమస్యలు వస్తే అధిగమించాలి కానీ ఆందోళన చెందకూడదు. మీరు గతాన్ని, భవిష్యత్తును నియంత్రించలేరు. మీ దగ్గర ఉన్నది కేవలం వర్తమానం మాత్రమే.. కాబట్టి ఈ వర్తమానాన్ని పూర్తిస్థాయిలో జీవించడానికి ప్రయత్నించండి. మీరు అనుకున్న ప్రకారం ఉద్యోగం రాకపోయినా, ఆశించినట్లు ఏ పనీ విజయవంతం కాకపోయినా, నిరాశ చెందకండి. ప్రతిదీ ఒక కారణం ప్రకారమే జరుగుతుందని నమ్మండి. భవిష్యత్తు గురించి ఆందోళన, మనసుపై ఒత్తిడిని పెంచుతుంది. గతం గురించి ఆలోచిస్తే బాధే మిగులుతుంది. ఆ రెండింటి కోసం నేటి వర్తమానాన్ని నాశనం చేసుకోకండి. మీ ఆలోచనల రూపమే మీ జీవితం. కాబట్టి మిమ్మల్ని విచ్ఛిన్నం చేసే ఆలోచనలను మనసులో రానివ్వకండి. ఏదైనా పరీక్షలు, ఇంటర్వ్యూకి ముందు మీ మనసును సానుకూలంగా ఉంచుకోండి. తప్పకుండా విజయం మీకు దాసోహం అవుతుంది.
ఒక విషయాన్ని మాత్రం కచ్చితంగా గుర్తు ఉంచుకోండి.. మీరు ఈ లోకంలోకి ఒంటరిగానే వచ్చారు. తిరిగి ఒంటరిగానే వెళతారు. ఖాళీ చేతులతోనే ఈ భూమిపై అడుగు పెట్టారు. తిరిగి ఖాళీ చేతులతోనే భూమిలో కలిసిపోతారు. ఏ భౌతిక ఆస్తులు మీ వెనుక రావు. కాబట్టి ప్రశాంతంగా ఉండండి.. ఓపెన్ మైండ్‌తో బతికినన్నాళ్లు సంతోషంగా జీవించడానికి ప్రయత్నించండి.. సంపాదనపైనా, ఆస్తుల గొడవల్లో చిక్కుకోకుండా, ఉన్నంతలో సంతోషంగా జీవించేందుకు ప్రయత్నించండి. ఇలా చేస్తే కచ్చితంగా సంతోషం మీ వెంట ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.
READ ALSO: Camphor Tree: పూజల్లో ఉపయోగించే కర్పూరాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా!