మన దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రోజుకు కనీసం రెండు సార్లు పళ్లు తోముకోవడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒకసారి, రాత్రి పడుకునే ముందు మరోసారి పళ్లు తోముకోవాలి. ప్రతి సారి పళ్లు తోమేటప్పుడు కనీసం రెండు నిమిషాల పాటు మృదువుగా, అన్ని పళ్లూ శుభ్రంగా అయ్యేలా బ్రష్ చేయాలి. ఇలా చేయడం వల్ల పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహార అవశేషాలు, బ్యాక్టీరియా పూర్తిగా తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
పళ్లు తోముకోవడంతో పళ్ల కుళ్లు, దంత నొప్పి, నోటి దుర్వాసన వంటి సమస్యలు దూరంగా ఉంటాయి. బ్రష్ చేయకపోతే దంతాలపై ఫ్లేక్ పేరుకుపోతుంది. ఈ ఫ్లేక్ దంతాల ఎనామిల్‌పై దాడి చేసి, కాలక్రమేణా ఎనామిల్ దెబ్బతిని కావిటీస్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అందుకే క్రమం తప్పకుండా సరైన పద్ధతిలో పళ్లు తోముకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
పళ్లు తోముకునేటప్పుడు మృదువైన బ్రష్‌ను ఉపయోగించాలి. బ్రష్‌ను ముందుగా నీటితో తడిపి, ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్‌ను తీసుకొని, దంతాలను 45 డిగ్రీల కోణంలో రెండు నిమిషాల పాటు బ్రష్ చేయాలి. దంతాల ముందు భాగం, వెనుక భాగం, పైభాగం అన్నింటినీ శుభ్రం చేయాలి. అలాగే నాలుకను కూడా శుభ్రం చేసుకోవాలి. టూత్‌పేస్ట్‌ను ఉమ్మివేయాలి కానీ వెంటనే ఎక్కువగా నీటితో కడగకపోవడం మంచిది. రోజుకు రెండు సార్లకంటే ఎక్కువగా పళ్లు తోముకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన దంతాలు, అందమైన చిరునవ్వు కోసం పళ్లు తోముకోవడం మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన అలవాటుగా మార్చుకోవాలంటున్నారు..