Cervical cancer: వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే నటి-మోడల్ పూనమ్ పాండే 32 ఏళ్లలోనే గర్భాశయ క్యాన్సర్‌తో మరణించింది. దీంతో ఒక్కసారిగా ఈ క్యాన్సర్ ఎంటా..? అని అందరు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో వచ్చే ఈ క్యాన్సర్, ఇటీవల కాలంలో తన ప్రభావాన్ని చూపిస్తోంది. తాజాగా కేంద్రం ఈ క్యాన్సర్‌ని అడ్డుకునేందుకు 9-14 ఏళ్ల బాలికలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు సిద్ధమైంది.
భారతదేశంలో ఈ గర్భాశయ క్యాన్సర్లని ముందుగా గుర్తించకపోవడంతోనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. గర్భాశయ క్యాన్సర్ ప్రారంభ దశల్లో గుర్తించబడదు, ఫలితంగా ఇది ప్రాణాంతకంగా మారిన తర్వాతే వ్యాధి గురించి తెలుసుకుంటున్నారు. దీంతో మరణించే అవకాశాలు పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
గర్భాశయ క్యాన్సర్, HPV అంటే ఏమిటి?
లైంగిక సంపర్కం ద్వారా వచ్చే వ్యాధుల్లో ఈ గర్భశయ క్యాన్సర్ తీవ్రమైంది. ఇది గర్భాశయ లైనింగ్‌ని దెబ్బతీసి, కణాలను ప్రభావితం చేస్తోంది. ఫలితంగా కణవిభజన వేగంగా జరిగి, క్యాన్సర్లుగా మారుతుంది.
హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) గర్భాశయ క్యాన్సర్‌కు ప్రధాన కారణం. సెక్స్ సమయంలో వైరస్ ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. ఇది ఎలాంటి లక్షణాలు చూపకుండా, సైలెంట్ కిల్లర్‌గా మారుతోంది. కొన్ని సందర్భాల్లో ఈ వైరస్ కలిగి ఉన్నవారిలో లక్షణాలు కనబడేందుకు కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు.
భారతదేశంలో పెరుగుతున్న క్యాన్సర్ భారం..
రొమ్ము క్యాన్సర్ తర్వాత భారతదేశ మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో సర్వికల్ క్యాన్సర్(గర్భాశయ క్యాన్సర్) రెండోస్థానంలో ఉంది. ఇది ముఖ్యంగా మిడిల్ ఏజ్ మహిళల్ని ప్రభావితం చేస్తోంది. 2022లో, భారతదేశంలో 1,23,907 గర్భాశయ క్యాన్సర్ కేసులు మరియు 77,348 మరణాలు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న గర్భాశయ క్యాన్సర్లలో ఒకటి భారత్‌లోనే నమోదవుతోంది. వాస్తవానికి, లాన్సెట్ అధ్యయనం ప్రకారం, ఆసియాలో భారతదేశం అత్యధిక గర్భాశయ క్యాన్సర్ భారాన్ని కలిగి ఉంది, చైనా తర్వాతి స్థానంలో ఉంది. 2022లో ప్రపంచవ్యాప్తంగా 6,04,127 గర్భాశయ క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. మొత్తం గర్భాశయ కేసుల్లో 21 శాతం భారతదేశంలోనే ఉన్నాయి.
ఈ క్యాన్సర్లను గుర్తించడం కష్టమా..? చికిత్స ఏమిటి..?
నిజానికి హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) ఇన్ఫెక్షన్, క్యాన్సర్‌గా మారడానికి 10-15 ఏళ్ల సంవత్సరాల వ్యవధి ఉంటుంది. లైంగికంగా చురుకైన మహిళల్లో 80-90 శాతం ఈ వైరస్ ఉండే అవకాశం ఉంది. మన రోగనిరోధక వ్యవస్థ రెండు మూడు ఏళ్లలో ఈ వైరస్‌ని శరీరం నుంచి తొలగిస్తుంది. అయితే, అది అలాగే శరీరంలోనే ఉంటే ముఖ్యంగా HPV-16, 18 వంటి అధిక-ప్రమాదకర జాతులు, ఇది గర్భాశయ క్యాన్సర్‌కు దారితీయవచ్చని వైద్యులు చెబుతున్నారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సరైన స్క్రీనింగ్ పద్ధతులు, చికిత్స సౌకర్యాలు లేకపోవడంతో మహిళల్లో ఈ వ్యాధి ముదిరే దాకా ఈ బయటపడటం లేదు. చికిత్స విషయానికి వస్తే 9-14 ఏళ్ల బాలికలకు HPV టీకాలు వేస్తే ఈ వైరస్ నుంచి రక్షణ పొందొచ్చు. మరోవైపు క్యాన్సర్‌ని ఎర్లీ స్టేజ్‌లో గుర్తిస్తే చికిత్స ద్వారా రక్షించవచ్చు.