చలికాలంలో రోగనిరోధక పెరుగుతోంది. మారుతున్న వాతావరణంతో జలుబు, జ్వరం రావడం సాధారణ విషయం. చలికాలంలో చాలా మంది జలుబు, జ్వరంతో బాధపడుతుంటారు. జ్వరానికి అనేక కారణాలు ఉండవచ్చు. వాతావరణంలో మార్పు, విపరీతమైన చలి కారణంగా ఫీవర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. జ్వరం ఎక్కువ కాలం కొనసాగితే వైద్యులను సంప్రదించి అనేక రకాల మందులు వాడుతున్నారు. అయితే కొన్ని హోం రెమెడీస్ సహాయంతో మీరు జ్వరం నుంచి ఉపశమనం పొందవచ్చట. అవేంటో ఇప్పుడు చూద్దాం..
కావాల్సిన పదార్థాలు..
50 గ్రాముల శొంఠి చూర్ణం
50 గ్రాముల మిరియాల చూర్ణం
50 గ్రాముల ధనియాల చూర్ణం
50 గ్రాముల పసుపు
50 గ్రాముల తులసి చూర్ణం
తయారీ విధానం
ముందుగా స్టౌ వెలిగించుకుని ఓ గిన్నెలో 100 మిల్లీ లీటర్లు నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇవి వేడయ్యే లోపు మరో గిన్నెలో శొంఠి చూర్ణం, మిరియాలు, ధనియాలు, పసుపు, తులసి చూర్ణం వేసి బాగా కలపాలి. ఇప్పుడు మనం కలిపిన చూర్ణాన్ని ఒక చెంచాడు తీసుకుని ఈ నీటిలో వేసుకుని మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి వడబెట్టుకుంటే ఆయుర్వేద ఔషధం రెడీ అయినట్లే..
ఎంత మోతాదులో తీసుకోవాలి?
చలికాలంలో జ్వరం వచ్చినప్పుడు తగ్గడానికి సుమారుగా 40-50 మిల్లీ లీటర్ల పరిమాణంలో మూడు పూటాల తీసుకోవాలని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇంకా జ్వరం రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా వాడుకోవచ్చని అంటున్నారు. ఇలాంటి వారు ఉదయం, సాయంత్రం 30 మిల్లీ లీటర్ల పరిమాణంలో తీసుకోవాలని వివరించారు.
ఈ కషాయం చేసుకుని తాగితే కలిగే ప్రమోజనాలు..
చలికాలంలో వచ్చే కఫాన్ని తగ్గించడంలో శొంఠి ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇంకా జీర్ణశక్తిని మెరుగుపరిచి అజీర్తి సమస్యను తగ్గిస్తుందట. ముఖ్యంగా ఇన్ఫెక్షన్లు తగ్గడానికి, శరీరంలోని మలినాలు బయటకు వెళ్లడానికి మిరియాలు ఉపయోగపడుతుందన్నారు. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్లు, వైరస్లను తగ్గించడానికి పసుపు బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఆయుర్వేద ఔషధాల తయారీలో తులసి మొక్కను అనేక రకాలుగా వాడుతుంటారు. వైరల్ ఇన్ఫెక్షన్, జ్వరాలు తగ్గడానికి తులసి చాలా సహాయపడుతుందని అంటున్నారు. జరాన్ని తగ్గించడంలో ధనియాలు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు. జ్వరం వచ్చినప్పుడు ధనియాల కషాయం చేసుకుని తాగితే సరిపోతుందని అంటున్నారు.