ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. దీన్ని బట్టి తెలుసుకోవచ్చు ఉల్లిగడ్డకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో. ఉల్లిగడ్డను వంటల్లో అనుబంధ పదార్థంగా ఉపయోగిస్తుంటారు. వంటింట్లో కచ్చితంగా ఉంటుంది. ఉల్లిగడ్డలను, ఉల్లి కాడలను కూరలుగా చేసుకుని తింటుంటారు. కాగా కొందరు పచ్చి ఉల్లిపాయలను కూడా ఆహారంగా తీసుకుంటుంటారు. మజ్జిగలో ఉల్లిపాయ ముక్కలను వేసుకుని తీసుకుంటారు. బిర్యానీ, ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు కూడా పచ్చి ఉల్లిపాయలను తింటుంటారు. అయితే ప్రతి రోజు పచ్చి ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
రుచికే కాదు ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు. అనేక రకాల వ్యాధులను దరిచేరనీయకుండా అడ్డుకుంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రక్తపోటు, గుండె జబ్బులు, ఆస్తమా, అలర్జి, ఇన్ఫెక్షన్, దగ్గు, జలుబు, నిద్రలేమి, ఊబకాయము వంటి వ్యాధులకు ఉల్లి దివ్యఔషధంగా ఉపయోగపడుతుంది. ఉల్లిపాయలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఉల్లి స్టమక్ అప్సెట్ నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. ఉల్లిపాయల్లో శరీరానికి అవసరమైన పొటాషియం, మాంగనీస్, కాపర్, విటమిన్ సి, విటమిన్ 6 ఉల్లిపాయల్లో పుష్కలంగా లభిస్తాయి. ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల నరాల సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది.
ఉల్లిపాయ బాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. ఇందులోని ఔషధ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పచ్చి ఉల్లిపాయలలో ఫైబర్ మెండుగా ఉంటుంది. ఫైబర్ మలబద్ధకం, మూలవ్యాధి సమస్యను తగ్గిస్తుంది. ఉల్లిపాయల్లో చర్మం ముడతలు, మచ్చలు, పిగ్మెంటేషన్ తొలగించే గుణం ఉంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పచ్చి ఉల్లిపాయల్లోని క్వెర్సెటిన్ , ఆర్గానిక్ సల్ఫర్ ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించడానికి పని చేస్తాయి. పచ్చి ఉల్లిపాయలను ఆహారంగా తీసుకుంటే రక్తం గడ్డకట్టడాన్ని విచ్ఛిన్నం చేయడంతోపాటు గుండె జబ్బులు, గుండె స్ట్రోక్‌లను నిరోధిస్తుంది.
పచ్చి ఉల్లిని తీసుకుంటే జీర్ణ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. పచ్చి ఉల్లిపాయను రోజువారీగా తీసుకుంటూ ఉంటే మహిళల్లో ఋతుక్రమం సక్రమంగా ఉంటుంది. ఉల్లిపాయలను తినడం వల్ల అంతర్గత రక్తస్రావాలను అరికడుతుంది. ఒకటి లేదా రెండు ఉల్లిపాయలను చిన్నగా తరిగి నీళ్లలోవేసి మరిగించి తాగుతూ ఉంటే మూత్రంలో మంట తగ్గుతుంది. కాబట్టి పచ్చి ఉల్లిపాయలను ఆహారంలో చేర్చుకుంటే సంపూర్ణమైన ఆరోగ్యం మీసొంతం అవుతుందంటున్నారు నిపుణులు.