సాధారణంగా మనం వంటల్లో ఎర్రకారంపొడిని వాడుతుంటాం. అయితే ఇకపై పచ్చకారంపొడి కూడా అందుబాటులోకి రానుంది. యూపీలోని వారణాసికి చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసెర్చ్ పచ్చిమిర్చి పొడిని తయారుచేసే సాంకేతికతను అభివృద్ధి చేసింది. త్వరలోనే పచ్చ కారంపొడిని అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు ఈ కొత్త ఆకుపచ్చని కారానికి సంబంధించిన సాంకేతికతకు IIVR పేటెంట్ హక్కులను కూడా పొందింది.
ఆకుపచ్చ కారంపొడిని ఎలా తయారుచేస్తారంటే… తొలుత పచ్చిమిరపకాయలను ప్రత్యేక పద్ధతుల్లో రంగు పోకుండా ఎండబెట్టి కారంపొడి చేస్తారు. ఇది మరింత ఘాటుగా, కారంగా ఉంటుంది. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. ఆహారంలో ఈ కారాన్ని ఉపయోగించడం వల్ల మనం తిన్న తర్వాత త్వరగా జీర్ణం అవుతుంది. శరీరానికి యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు కూడా లభిస్తాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షించేలా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
కాగా ఎర్ర కారంపొడితే పోలిస్తే ఆకుపచ్చని కారంపొడిలో 30 శాతానికి మించి విటమిన్ సి, 94-95 శాతం క్లోరోఫిల్, 65-70 శాతం క్యాప్సిన్ ఉంటాయని IIVR తెలిపింది. ఎర్ర కారంపొడితో పోలిస్తే ఇలాంటి కారపు పొడిలో ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయని వెల్లడించింది. అంతేకాకుండా పచ్చ కారంపొడిని సాధారణ ఉష్ణోగ్రత వద్ద చాలా నెలల పాటు నిల్వ చేయవచ్చని వివరించింది.