Zohran Mamdani: న్యూయార్క్ మేయర్ పదవికి ముందు వరసలో ఉన్న డెమొక్రాట్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నగర మేయర్‌గా ఎన్నికైతే ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను నగరంలోకి ప్రవేశిస్తే, అరెస్ట్ చేయాలని న్యూయార్క్ పోలీస్ శాఖను ఆదేశిస్తానని అన్నారు. ది న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిని నేను నేరవేర్చాలనుకుంటున్నానని అన్నారు.
అమెరికా ‘‘అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ)’’ అధికారాన్ని గుర్తించనప్పటికీ, ఐసీసీ కోర్టు జారీ చేసిన వారెంట్‌ను గౌరవిస్తానని, నెతన్యాహూ న్యూయార్క్‌లో అడుగుపెడితే విమానాశ్రయంలోనే ఆయనను అరెస్ట్ చేయిస్తానని మమ్దానీ అన్నారు. గాజా స్ట్రిప్‌లో నెతన్యాహూ మానవాళికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ‘‘న్యూయార్క్ అంతర్జాతీయ చట్టం కోసం నిలబడే నగరంగా ఉండేలా చూసుకోవాలనేది నా కోరిక’’ అని మమ్దానీ అన్నారు.
నిజానికి న్యూయార్క్ యూదులకు రెండో అతిపెద్ద నివాసం. ఒక వేళ ఇలాంటి ప్రణాళికలకు మమ్దానీ పూనుకుంటే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతుంది. మరోవైపు, ఒక దేశానిధినేత నెతన్యాహూకు వేరే దేశానికి అరెస్ట్ చేసే అధికారం ఉండదు. కొలంబియా లా స్కూల్ ప్రొఫెసర్ మాథ్యూ సి. వాక్స్‌మన్ ది న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. మమ్దానీ కోరిక ‘‘తీవ్రమైన చట్ట అమలు విధానం కన్నా రాజకీయ స్టంట్‌గా ఉంది’’ అని అన్నారు. ఇలాంటి అరెస్టులు అమెరికన్ గడ్డపై ఎప్పుడూ జరగలేదని అన్నారు. మమ్దానీ అరెస్ట్ బెదిరింపుల గురించి తాను ఆందోళన చెందడం లేదని నెతన్యాహూ వైట్‌హౌజ్‌లో అన్నారు. ఆయన వ్యాఖ్యల్ని పిచ్చి వ్యాఖ్యలుగా కొట్టిపారేశారు.