అమెరికా బలగాల ఉపసంహరణతో కాబూల్ ఎయిర్‌పోర్టులో విమాన ప్రయాణాలు నిలిచిపోయాయి. తాలిబన్లు విమానాశ్రయాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడి విమానాలు అక్కడే నిలిచిపోయాయ్. విమానాశ్రయం లోపల తాలిబన్లు…హాయిగా సేద తీరుతున్నారు. నాటో దళాలు ఉపయోగించిన ప్రత్యేక దుస్తులు, ఇతర సామాగ్రి…చిందరవందరగా పడిపోయింది. బట్టలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయ్. వీటిలో పనికి వచ్చే వాటిని…తాలిబన్లు ఏరుకుంటున్నారు. యుద్దానికి ఉపయోగించిన హెలికాప్టర్లు పనికిరాకుండా పోయాయ్. జీపులు, ట్రక్కులు…ధ్వంసమయ్యాయి.
తాజాగా కాబుల్‌లోని హమీద్ కర్జాయ్ విమానాశ్రయం…తిరిగి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. అయితే దేశీయ విమాన సర్వీసులను మాత్రమే నడపనున్నట్లు ఎయిర్ లైన్స్ స్టేషన్ అధికారులు తెలిపారు. అరియానా అప్గాన్ విమాన సంస్థ కాబూల్ నుంచి…మూడు ప్రావిన్స్‌లకు విమానాలు నడుపుతోంది. హెరాత్, దక్షిణ కాందహార్, ఉత్తర బల్క్ ప్రావిన్స్‌లకు ప్రయాణికులను మాత్రమే తీసుకెళ్లనున్నాయ్. అంతర్జాతీయ విమాన సర్వీసులపై కాబూల్ ఎయిర్‌పోర్టు అధికారులు…ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
ఆగస్టు నెలాఖరులో అమెరికన్ బలగాల నిష్ర్కమణతో హమీద్ కర్జాయ్ ఎయిర్‌పోర్ట్ తాలిబన్ల చేతిలోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి కాబూల్ ఎయిర్‌పోర్టును మూసివేశారు. ఆగస్టు 30 అర్ధరాత్రి అమెరికాకు చెందిన ఆఖరు విమానం లార్జ్ సీ-17 టేకాఫ్ అయింది. తాలిబన్లు కాబుల్‌ను ఆక్రమించిన అనంతరం.. అఫ్గాన్‌ను వదిలి వెళ్లేందుకు వేలాది మంది ప్రజలు ఈ విమానాశ్రయానికి పోటెత్తారు. కాల్పులు, తొక్కిసలాటలు, బాంబు పేలుళ్లతో విమానాశ్రయంతోపాటు పరిసరాల్లో ఆందోళనకర పరిస్థితులు కొనసాగాయి.