Turkey: టర్కీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారతీయులు ఆ దేశంపై మండిపడుతున్నారు. భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్‌కి సహకరించింది. టర్కిష్ డ్రోన్లతో పాటు వాటిని ఆపరేట్ చేయడాని ఆ దేశ సిబ్బందిని కూడా నియమించింది. భారత్ జరిపిన దాడుల్లో డ్రోన్లతో పాటు, వాటిని ఆపరేట్ చేయడానికి వచ్చిన సిబ్బంది కూడా హతమయ్యారు. తాజాగా, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ టర్కీ పర్యటనకు వెళ్లారు.
అయితే, ఎర్డోగాన్ టర్కీ ప్రెసిడెంట్ అయిన తర్వాత పూర్తిగా భారత వ్యతిరేక వైఖరిని తీసుకున్నారు. 2019లో భారత్ ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు, భారత్ చర్యలకు వ్యతిరేకంగా, పాకిస్తాన్‌కి మద్దతుగా టర్కీ మాట్లాడింది. తాజాగా, ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ మాట్లాడుతూ.. ‘‘మేము పాకిస్తాన్ ప్రజలతో నిలబడతాము. నేను సోదరుడు షాబాజ్ షరీఫ్‌కు ఫోన్ చేసి, మేము కలిసి ఉన్నామని చెప్పాను. భవిష్యత్తులో కూడా మేము పాకిస్తాన్‌తో నిలబడతాము.” అని చెప్పారు.
ఇస్లాం ప్రపంచానికి పెద్దన్న వ్యవహరించాలనే కల:
టర్కీ ఇస్లామిక్ ప్రపంచాన్ని పెద్దన్నగా వ్యవహరించాలని కలలుకంటోంది. ఈ నేపథ్యంలోనే మరో ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్‌కి మద్దతు నిలుస్తోంది. సౌదీ అరేబియా, యూఏఈ ఆధిపత్యాన్ని సవాల్ చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్‌ని వ్యతిరేకిస్తూ, పాకిస్తాన్‌కి దగ్గరవుతోంది. తన ఆయుధాలను పాకిస్తాన్‌కి అమ్మాలని చూడటం కూడా ఒక కారణం.
నాటోలో ఒంటరవుతున్న టర్కీ:
గత కొన్ని సంవత్సరాలుగా నాటో కూటమిలో టర్కీ ఒంటరివుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికా నేతృత్వంలోని కూటమిలో ఉంటూనే రష్యా, చైనాలతో టర్కీ స్నేహాన్ని పెంచుకుంటోంది. రష్యా నుంచి ఎస్-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌ని కొనుగోలు చేసింది. దీంతో కొత్త స్నేహాల కోసం చూస్తోంది. దీంతోనే పాకిస్తాన్‌కి దగ్గరవుతోంది.
టర్కీ వ్యతిరేకులతో భారత్ మైత్రి:
టర్కీ భారతదేశ వ్యతిరేకతకు మరో కారణం దాని శత్రువులతో భారత్ మైత్రి. ముఖ్యంగా, ఆర్మేనియా-అజర్ బైజార్ మధ్య నగోర్నో-కారోబాఖ్ యుద్ధంలో టర్కీ, పాకిస్తాన్ అజర్ బైజాన్‌కి మద్దతు ఇచ్చాయి. ఈ యుద్ధంలో ఓడిపోయిన ఆర్మేనియాకు భారత్ స్వదేధీ వైమానిక రక్షణ వ్యవస్థ ఆకాష్‌తో సహా పలు కీలక రక్షణ సామాగ్రిని అందించింది. టర్కీ ప్రాంతీయ ప్రత్యర్థులైన గ్రీస్, ఇరాన్, సైప్రస్, యూఏఈ, ఇజ్రాయిల్‌తో భారత్ మంచి రక్షణ, వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. ఇది కూడా టర్కీని పాకిస్తాన్ బంధాన్ని బలపరించింది.