కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇంత వరకూ 38 దేశాలకు ఈ వైరస్ పాకినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అయితే, ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ఇంత వరకూ ఒక మరణం కూడా నమోదు కాకపోవడం విశేషం. కరోనా వైరస్ ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటోంది. మన దేశంలో కరోనా సెకండ్ వేవ్‌కు డెల్టా వేరియంట్ కారణమైంది. అప్పట్లో 90 శాతం కేసులకు డెల్టా వేరియంటే కారణం. అయితే… తాజాగా వెలుగు చూసిన ఒమిక్రాన్ డెల్టా వేరియంట్‌ను మించిపోయింది. డెల్టా వేరియంట్‌కు మూడు రెట్లు అధికంగా ఒమిక్రాన్ వేరియంట్ సోకుతున్నట్టు గుర్తించారు. ఇప్పటి వరకూ 38 దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే, ఇంత వరకూ కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ఒక్క మరణం కూడా నమోదు కాకపోవడం కొంత ఊరటనిచ్చే అంశం.
రెండు డోసుల వ్యాక్సీన్ తీసుకున్న వాళ్లు కూడా ఒమిక్రాన్ బారి నుంచి తప్పించుకోలేకపోతున్నారు. కాకపోతే… వాళ్లపై వైరస్ ప్రభావం చాలా తక్కువగా ఉంటోంది. అందువల్ల వ్యాక్సీన్ల ప్రభావ శీలతను సంకించాల్సిన అవసరం లేదంటోంది డబ్ల్యూహెచ్. అలాగే, ఒమిక్రాన్ గురించి ఇప్పుడే ఏమీ చెప్పడానికి లేదంటున్నారు నిపుణులు.
కరోనా వైరస్‌లో ఒమిక్రాన్ వేరియంట్‌ను ముందుగా సౌతాఫ్రికాలో గుర్తించారు. నవంబర్ 9న సేకరించిన నమూనాకు జినోమ్ సీక్వెన్సింగ్ చేయగా… కొత్త వేరియంట్ వెలుగు చూసింది. ఈ విషయాన్ని నవంబర్ 24న డబ్ల్యూహెచ్ కు తెలియజేశారు సౌతాఫ్రికా వైద్య నిపుణులు. మరోవైపు నవంబర్ 19 నుంచి 23 తేదీల మధ్య తీసిన నమూనాల్లో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించినట్టు నెదర్లాండ్స్ చెబుతోంది. దీంతో ఒమిక్రాన్ ఎప్పుడు ఎక్కడ పుట్టిందనే విషయంపై స్పష్టత లేకుండాపోయింది. సౌతాఫ్రికాలో దానిని గుర్తించే సమయానికే ఇతర దేశాలకు ఈ వేరియంట్ వ్యాపించిందా అనే సందేహాలు సైతం వ్యక్తమౌతున్నాయి.
ఒమిక్రాన్ వ్యాపిస్తున్న తీరు చూస్తుంటే మున్ముందు దీని ప్రాబల్యం మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టమౌతోంది. అయితే, ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా డెల్టా ప్రాబల్యమే అధికంగా ఉందని డబ్ల్యూహెచ్ చెబుతోంది. అందువల్ల డెల్టా వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు అనుసరించిన పద్ధతిలోనే ఒమిక్రాన్‌ను అడ్డుకట్ట కట్టడి చేయాలని ప్రపంచ దేశాలకు సూచించింది.