మంకీపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ యోచిస్తోంది. ఈ అంశంపై గురువారం కమిటీ సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేసి చర్చించింది. ఇప్పటికే 42 దేశాల్లో 3.300 కేసులు వచ్చినట్లు అమెరికాలోని వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రాలు’ వెల్లడించాయి. వీటిలో 80 శాతం కేసులు ఒక్క యూరప్‌లోని వచ్చాయి.
కరోనా తర్వాత ప్రపంచాన్ని భయపెడుతోన్న మరో వైరస్ మంకీపాక్స్. పశ్చిమ ఆఫ్రికాలో మొదలైన ఈ వైరస్ ఇప్పటికే అనేక దేశాలకు పాకింది. మంకీపాక్స్ మరిన్ని దేశాలకు విస్తరించడంపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. అసలు మంకీపాక్స్ అంటే ఏంటి?, దాని నివారణ చర్యలు తదితర అంశాలపై ముందుగా అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. కానీ మంకీపాక్స్ వ్యాప్తిని ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా వర్గీకరించాలా వద్దా అనే విషయంపై అత్యవసర సమావేశాన్ని డబ్ల్యూహెచ్‌వో ఏర్పాటు చేసింది.
మంకీపాక్స్ వ్యాధులు ఎక్కువగా నమోదవ్వడంతో ఇది అసాధరణమైన వ్యాధి అని సందేహం కలుగుతోందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనామ్ అన్నారు.
అందువల్ల ఈ విషయమై అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల ప్రకారం అత్యవసర కమిటీని సమావేశపరచామని ఆయన వెల్లడించారు. . ఈ వ్యాప్తి అంతర్జాతీయపరంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని సూచిస్తుందో లేదో అంచనా వేయడానికే సమావేశం ఏర్పాటు చేశామన్నారు. త్వరలో ఈ విషయంపై నిర్ణయం వెల్లడించనున్నారు.